కేంద్రం సూచనతోనే అమరావతికి రుణంపై వెనక్కి

Update: 2019-07-21 16:33 GMT

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి రుణం మంజూరు విషయంలో ప్రపంచ బ్యాంక్ వెనక్కి తగ్గటం ఏపీలో రాజకీయంగా పెద్ద దుమారం రేపింది. దీనిపై అధికార, విపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. అయితే ఈ రుణానికి సంబంధించి ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన ప్రకటనతో అసలు విషయం తేలిపోయింది. కేంద్రం సూచనలతోనే తాము అమరావతికి రుణం విషయంలో వెనక్కి తగ్గినట్లు ప్రపంచ బ్యాంక్ స్పష్టం చేసింది. అదే సమయంలో ఇప్పటికే కుదుర్చుకున్న ఒప్పందాలకు సంబంధించిన రుణాలు కొనసాగుతాయని..కొత్త రుణాల విషయంలో కూడా తమకు అందే ప్రతిపాదనల ఆధారంగా నిర్ణయాలు ఉంటాయని పేర్కొంది.

దీంతో ఏపీ సీఎం గా జగన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత అమరావతిని పక్కన పెట్టారని..వైసీపీ వల్లే ప్రపంచ బ్యాంక్ రుణం కూడా వెనక్కి పోయిందని ప్రచారం చేస్తున్న టీడీపీకి ఇది ఓ రకంగా ఊహించని పరిణామమే. ఈ నెల 15న ఏపీ రాజధానికి ఆర్థిక సాయంపై ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుందని వరల్డ్‌ బ్యాంక్‌ తెలిపింది. కేంద్రం ఉపసంహరణతోనే తమ డైరక్టర్ల బోర్డు ఆ నిర్ణయం తీసుకుందని పేర్కొంది. అమరావతిలో జరిగిన అక్రమాలకు సంబంధించి జగన్ సర్కారు మంత్రివర్గ ఉప కమిటీతో విచారణ జరిపిస్తోంది. రాబోయే పక్షం రోజుల్లో దీనికి సంబంధించిన అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

 

 

Similar News