ఏపీ నూతన గవర్నర్ గా హరిచందన్ ప్రమాణ స్వీకారం

Update: 2019-07-24 07:37 GMT

రాష్ట్ర విభజన జరిగిన ఐదేళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ కు తొలి గవర్నర్ వచ్చారు. ఇంత కాలంగా తెలంగాణ, ఏపీలో ఈఎస్ఎల్ నరసింహనే గవర్నర్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితమే కేంద్రం ఏపీకి బిశ్వభూషన్ హరిచందన్ ను గవర్నర్ గా నియమించింది. మంగళవారం నాడు తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకున్న కొత్త గవర్నర్ బుధవారం నాడు ఏపీ నూతన గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సి ప్రవీణ్‌కుమార్‌ పదవీ ప్రమాణం చేయించారు. విజయవాడలోని రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. గవర్నర్‌ ప్రమాణ స్వీకారానికి సీఎం, ఎమ్మెల్యేలు హాజరయ్యేందుకు వీలుగా శాసనసభను మధ్యాహ్ననికి వాయిదా వేశారు.

దీంతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుల్లో అసెంబ్లీ నుంచి రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. ఒడిశాకు చెందిన విశ్వభూషణ్‌కు విశేష రాజకీయ అనుభవం ఉంది. భారతీయ జనసంఘ్‌లో 1971లో చేరడం ద్వారా రాజకీయ ప్రవేశం చేసిన విశ్వభూషణ్‌ హరిచందన్‌.. ఆ పార్టీ జాతీయ కార్యనిర్వాహక సభ్యునిగా, రాష్ట్ర జనరల్‌ సెక్రటరీగా పనిచేశారు. ఎమర్జెన్సీని వ్యతిరేకించినందుకు ఆయన 1975లో మీసా చట్టం కింద నిర్బంధానికి గురయ్యారు. 1977లో భారతీయ జనసంఘ్‌ జనతా పార్టీగా మారే వరకు ఆయన ఆ పదవుల్లో కొనసాగారు. తర్వాత బీజేపీలో చేరి 1980 నుంచి 1988 వరకు ఒడిశా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు.

 

Similar News