బాలినేనికి ఇరిగేషన్..ఆళ్ళకు వ్యవసాయ శాఖ!

Update: 2019-06-01 06:30 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అత్యంత కీలకమైన సాగునీటి శాఖను బాలినేని శ్రీనివాసరెడ్డికి అప్పగించబోతున్నారా?. అంటే ఔననే చెబుతున్నాయి వైసీపీ వర్గాలు. మరో కీలకశాఖ అయిన ఆర్థిక శాఖను బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి, వ్యవసాయ శాఖను మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డిలకు కేటాయించే అవకాశం ఉందని సమాచారం. శాసనసభ స్పీకర్ గా కోనపతి రఘుపతిని ఎంపిక చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. స్పీకర్ పోస్టు మరోసారి కూడా గుంటూరు జిల్లాకు వెళ్ళటం ఖాయం అయినట్లే కన్పిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ చివరి స్పీకర్ గా గుంటూరు జిల్లా తెనాలికి చెందిన నాదెండ్ల మనోహర్ ఉన్న విషయం తెలిసిందే. విభజన తర్వాత కూడా గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన కోడెల శివప్రసాద్ రావు స్పీకర్ గా ఎన్నికయ్యారు. ఇఫ్పుడు మరోసారి గూంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గానికి చెందిన కోన రఘపతి స్పీకర్ గా ఎన్నికయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.

ప్రస్తుతం ప్రచారంలో ఉన్నట్లు జగన్ తొలి దశలో కొంత మందినే మంత్రులుగా తీసుకుంటారా? లేక ఒకేసారి పూర్తి మంత్రివర్గ విస్తరణ చేస్తారా అంటే..పూర్తి స్థాయి విస్తరణకే ఛాన్స్ ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఒకే దఫా విస్తరణ పూర్తి చేసి..పాలనపై ఫోకస్ పెడతారని చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ ఏకంగా 151 సీట్లను దక్కించుకున్న విషయం తెలిసిందే. అయినా కూడా ఎవరూ జగన్మోహన్ రెడ్డిని కలసి తమకు మంత్రి పదవి కావాలని అడిగే సాహసం ఎమ్మెల్యేలు చేయటం లేదని..జగన్ నిర్ణయమే ఫైనల్ అని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. ఇప్పటికే సామాజిక సమీకరణల ఆధారంగా జాబితా రెడీ అయిందని సమాచారం.

జగన్ కేబినెట్ లో ఖచ్చితంగా మంత్రి పదవి దక్కించుకునే వారిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (చిత్తూరు), బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి(కర్నూలు), బాలినేని శ్రీనివాసరెడ్డి (ప్రకాశం), బొత్స సత్యనారాయణ(విజయనగరం) కొలగట్ల వీరభద్రస్వామి (విజయనగరం), ధర్మాన ఫ్యామిలీ నుంచి ఒకరికి (శ్రీకాకుళం), పార్ధసారధి(కృష్ణా), కొడాలి నాని(కృష్ణా),, ఉదయభాను(కృష్ణా),, సుచరిత (గుంటూరు), ఆదిమూలం సురేష్(ప్రకాశం), పిల్లి సుభాష్ చంద్రబోస్ (తూర్పు గోదావరి), విశ్వరూప్ (తూర్పు గోదావరి), ఆళ్ళ నాని లేదా గ్రంథి శ్రీనివాస్ (పశ్చిమ గోదావరి), అంజాద్ భాషా(కడప), గౌతమ్ రెడ్డి(నెల్లూరు), అవంతి శ్రీనివాస్(వైజాగ్) లు ఉంటారని చెబుతున్నారు. సామాజిక సమీకరణలు..వివిధ కోణాల్లో పలు సమీకరణలు చూసి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే జాబితా సిద్ధం చేసుకున్నారని చెబుతున్నారు. ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఒకరికి, అనంతపురం జిల్లా నుంచి బీసీ సామాజిక వర్గం ప్రతినిధులకు ప్రాధాన్యత ఇఛ్చే అవకాశం ఉందని సమాచారం. జూన్ 8 ఉదయం సచివాలయం సమీపంలోనే మంత్రివర్గ విస్తరణకు ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభం అయ్యాయి. దీంతో జగన్ కేబినెట్ లో బెర్తులు దక్కించుకునే మంత్రులెవరు?. అనే విషయమే ఇప్పుడు హాట్ టాపిక్ మారింది ఏపీ రాజకీయ వర్గాల్లో.

 

Similar News