విజయనిర్మల ఇకలేరు

Update: 2019-06-27 04:01 GMT

ప్రముఖ నటి..దర్శకులు విజయనిర్మల ఇకలేరు. సూపర్ స్టార్ కృష్ణ భార్య అయిన విజయనిర్మల బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆమె వయస్సు 73 సంవత్సరాలు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్‌ ఆస్పత్రిలో ఆమె గత కొంతకాలంగా వైద్య సేవలు తీసుకుంటున్నారు. 1946 ఫిబ్రవరి 20న తమిళనాడులో ఆమె జన్మించారు. ఏడేళ్ల వయసులో బాలనటిగా తమిళ చిత్రం మత్స్యరేఖతో సినీరంగ అరంగేట్రం చేశారు. 11 ఏళ్ల వయసులో పాండురంగ మహత్యం సినిమాతో తెలుగులో పరిచయమయ్యారు. మొదటి భర్త కృష్ణమూర్తితో విడిపోయిన అనంతరం విజయనిర్మల కృష్ణను రెండో వివాహం చేసుకున్నారు. ఆమెకు నరేష్ ఒక్కడే సంతానం.

సాక్షి చిత్రంతో తొలిసారిగా సూపర్ స్టార్ కృష్ణతో కలిసి నటించిన ఆమె ఆయనతో 47 చిత్రాల్లో నటించారు. తెలుగు, తమిళ, మలయాళంలో 200కుపైగా చిత్రాల్లో విజయనిర్మల నటించారు. సొంత నిర్మాణ సంస్థ విజయకృష్ణ పతాకంపై 15కుపైగా చిత్రాలను నిర్మించారు. 1971లో దర్శకత్వ బాధ్యతలు చేపట్టి తొలిసారిగా మీనా చిత్రాన్ని తెరకెక్కించారు. 44 చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆమె అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళగా గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించారు. విజయనిర్మల మృతిపై తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు కెసీఆర్, జగన్మోహన్ రెడ్డి లు తీవ్ర ద్రిగ్భాంతి వ్యక్తం చేశారు. విజయనిర్మల కుటుంబ సభ్యులకు తమ సంతాపాన్ని తెలియజేశారు.

 

Similar News