అటవీ అధికారులపై దాడి..ఎమ్మెల్యే సోదరుడి అరెస్ట్

Update: 2019-06-30 10:45 GMT

మహిళా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (ఎఫ్ఆర్ వో)పై దాడి వ్యవహారంలో పోలీసులు రంగంలోకి దిగారు. ఎమ్మెల్యే సోదరుడు, జడ్పీ వైఎస్ ఛైర్మన్ అయిన కోనేరు కృష్ణతో పాటు దాడిలో పాల్గొన్న వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంపై అధికార టీఆర్ఎస్ పార్టీ కూడా తీవ్రంగా స్పందించింది. జెడ్పీ వైస్ చైర్మన్ పదవితో పాటు కాగజ్‌నగర్‌ జెడ్పీటీసీ పదవికి కోనేరు కృష్ణ రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను కోనేరు కృష్ణ సోదరుడు ఎమ్మెల్యే కోనప్ప ధృవీకరించారు.

అటవీశాఖ అధికారులు కాగజ్‌నగర్‌లో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రత్యామ్నాయ అటవీకరణ పనులు నిర్వహిస్తున్నారు. విషయం తెలుసుకున్న జెడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణ పని జరుగుతున్న ప్రాంతానికి వచ్చి అటవీకరణ పనులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో అధికారులు, కృష్ణ వర్గీయుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో రెచ్చిపోయిన కృష్ణ, ఆయన అనుచరులు రేంజ్ ఆఫీసర్ అనితతో పాటు సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై అటవీ అధికారులు ఉన్నతాధికారులు ఫిర్యాదు చేశారు.

Similar News