ఎన్టీవీపై వంద కోట్ల పరువు నష్టం దావా

Update: 2019-06-23 10:42 GMT

రచనా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్(ఎన్టీవీ)పై వంద కోట్ల రూపాయల పరువు నష్టం కేసు దాఖలైంది. హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త సయ్యద్ హమీదుద్దీన్ ఈ కేసు దాఖలు చేశారు. రచనా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ తన క్లయింట్ తోపాటు..అతని కుటుంబ సభ్యుల వ్యక్తిత్వాన్ని దెబ్బతీయటంతోపాటు కీర్తి ప్రతిష్టలకు తీవ్ర విఘాతం కలిగించేలా ప్రజల్లో తీవ్ర వ్యతిరేక ప్రభావానికి గురిచేసే విధంగా హాని తలపెట్టి పరువు నష్ట కార్యకలాపాలు చేపట్టినందుకు గాను రచనా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ పై ఈ కేసు దాఖలు చేసినట్లు న్యాయవాదులు పేర్కొన్నారు. ఈ దావాలో రచనా టెలివిజన్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ తుమ్మల నరేంద్ర చౌదరి, ఎన్టీవీ న్యూస్ రీడర్ రోజా, ఎన్టీవీ ఎడిటర్ ఇన్ ఛీప్ రాజశేఖర్, రిపోర్టర్లు రమేష్ వైట్ల, అరవింద్ శర్మ, కమలాకరచారి, రాధాకృష్ణలను కూడా ప్రతివాదులుగా చేర్చారు.

సిటీ సివిల్ కోర్టులోని రెండవ అడిషినల్ చీఫ్ జడ్జి దగ్గర ఈ పిటీషన్ దాఖలైంది. ఓఎస్ నెంబర్ 299/2019లో 100 కోట్ల రూపాయల నష్టపరిహారం కోరుతూ దావా వేశారు. ప్రతివాదులు కోర్టు ముందు న్యాయవాదుల ద్వారా హాజరయ్యారు. సివిల్ ప్రొసీజర్ కోడ్ లోని నిబంధనల ప్రకారం వీరికి తగినంత అవకాశం కల్పించినప్పటికీ ప్రతివాదులు తమ లిఖితపూర్వక స్టేట్ మెంట్/వాదనలు కోర్టు ముందు ఉంచలేదు. దీంతో కోర్టు జూలై 5న పిటీషనర్ల వాదనలు వినటానికి అంగీకరించింది. ఈ వాదనల అనంతరం మెరిట్ ఆధారంగా కేసు ముందుకు సాగుతుందని పిటీషనర్ల తరపు న్యాయవాదులు డి. మాధవరావు, డి. రాఘవేంద్రరావులు లు ఆదివారం నాడు పత్రికల్లో ఓ ప్రకటన ఇచ్చారు.

Similar News