ఏపీ బిల్డింగ్ లు తెలంగాణకు

Update: 2019-06-03 03:18 GMT

ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన కీలక భవనాలు అన్నీ తెలంగాణకు అప్పగించారు. ఇందులో సచివాలయంలోని భవనాలతో పాటు పలు ఇతర కార్యాలయాలు కూడా ఉన్నాయి. అయితే ఏపీ అవసరాల కోసం మాత్రం రెండు భవనాల ఆ రాష్ట్రానికి కేటాయించనున్నారు. హైదరాబాద్ లో ఏపీకి కేటాయించిన భవనాలు తెలంగాణకు అప్పగిస్తూ గవర్నర్ నరసింహన్ ఆదివారం నాడు ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ మంత్రివర్గ వినతి మేరకు గవర్నర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయానికి ఏపీ నూతన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఏపీ సీఎం అనుమతి లేకుండా ఇలా చేయటం సాధ్యంకాదని..తాజాగా రాజ్ భవన్ లో ఇద్దరు సీఎంల భేటీ సందర్భంగానే దీనికి సంబంధించి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

జగన్ అలా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారో లేదో తెలంగాణ సర్కారు ఆగమేఘాల మీద పావులు కదిపి ఆదేశాలు తెచ్చుకోగలిగింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి సంబంధించిన పోలీసు విభాగానికి కొత్తగా ఒక భవనం, ఇతర కార్యాలయాలు నిర్వహించుకోవడానికి మరొక భవనం కేటాయించాలని అభ్యర్థించింది. దీనిపై తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం చేసిన తీర్మాన పత్రాన్ని సీఎం కేసీఆర్‌ ఆదివారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ను కలసి అందజేశారు. రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్‌ 8 కింద తనకు సంక్రమించిన అధికారులను ఉపయోగించుకొని గవర్నర్‌ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ ప్రభుత్వ అధీనంలో ఉన్న భవనాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం బకాయిపడిన ఆస్తి పన్నులు, ఇతర చార్జీలను తెలంగాణ ప్రభుత్వం మాఫీ చేయాలని గవర్నర్‌ సూచించారు.

 

Similar News