ప్రభుత్వం మారింది..వికెట్ పడింది

Update: 2019-05-27 08:45 GMT

నామినేటెడ్ పోస్టుల రాజీనామాల సీజన్ ప్రారంభం అయింది. ప్రభుత్వం మారటంతో గత ప్రభుత్వం నియమించిన వారంతా వరస పెట్టి రాజీనామాలు చేస్తున్నారు. ఇఫ్పటికే దుర్గగుడి పాలక మండలి రాజీనామా చేసింది. సోమవారం నాడు ఎస్వీబీసీ ఛైర్మన్ పదవికి ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామాకు కారణం వయోభారం అని చెబుతున్నా..కొత్త ప్రభుత్వం అందులో తమకు ఇష్టమైన వారిని నియమించుకోవటం సహజం కనుకే ఆయన తక్షణమే రాజీనామా చేసినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఒక రకంగా ఇది గౌరవప్రదమైన నిర్ణయం కూడా. తీసేసే వరకూ పోస్టు పట్టుకుని వేలాడకుండా..వెంటనే రాజీనామా చేయటం ద్వారా రాఘవేంద్రరావు సముచిత నిర్ణయం తీసుకున్నట్లే అని భావిస్తున్నారు.

రాఘవేంద్రరావు తన రాజీనామా లేఖను టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కు పంపారు. ఇంత కాలం తనకు సహకరించిన టీటీడీ యాజమాన్యానికి, సిబ్బందికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. 2015 నుంచి ఆయన టీడీపీ బోర్డులో కూడా కొనసాగారు. ఎస్వీబీసీ ఛానల్ ఛైర్మన్ నరసింహరావుపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు రావటంతో సర్కారు ఆయన్ను తప్పించి 2018 ఏప్రిల్ లో రాఘవేంద్రరావును నియమించింది. జగన్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొత్తగా ఈ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారో వేచిచూడాల్సిందే. టీటీడీ బోర్డుకు ఇంకా సమయం ఉన్నా కూడా కొత్త ప్రభుత్వం..కొత్త బోర్డు ఏర్పాటుకే మొగ్గుచూపే అవకాశం ఉందని చెబుతున్నారు.

 

Similar News