కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి

Update: 2019-05-30 10:58 GMT

తొలిసారి ఎంపీగా ఎన్నికైన బిజెపి సీనియర్ నేత కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈ మేరకు ఆయనకు ఢిల్లీ నుంచి వర్తమానం అందింది. కిషన్ రెడ్డి లోక్ సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి విజయం సాధించిన సంగతి తెలిసిందే. గురువారం ప్రధాని ఆఫీస్‌ నుంచి కిషన్‌ రెడ్డికి కాల్‌ రావడంతో కేంద్ర కేబినెట్‌లో ఆయన చోటు దక్కించుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కిషన్‌రెడ్డితో పాటు నిజామాబాద్‌ నుంచి ధర్మపురి అరవింద్, కరీంనగర్‌ నుంచి బండి సంజయ్, ఆదిలాబాద్‌ నుంచి బాపూరావు బీజేపీ తరఫున ఎంపీలుగా గెలుపొందిన సంగతి తెలిసిందే.

గత ఎన్నికల్లో ఒక్క సీటుకే పరిమితమైన బీజేపీ ఈసారి ఏకంగా నాలుగు స్థానాల్లో విజయబావుటా ఎగురవేయడంతో కేంద్ర కేబినెట్‌లో తెలంగాణ ప్రాతినిథ్యం తప్పనిసరి అని తేలిపోయింది. తొలి దశలో ఒక్క కిషన్ రెడ్డికిమాత్రమే ఛాన్స్ ఇచ్చారు. కిషన్‌రెడ్డి గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. అంబర్‌పేట నియోజకవర్గం నుంచి 2004, 2009, 2014 ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. శాసనసభాపక్ష నేతగా పనిచేసిన అనుభవమూ ఆయనకు ఉంది.

 

 

Similar News