మోహన్ బాబుకు ఏడాది జైలు శిక్ష

Update: 2019-04-02 12:44 GMT

ప్రముఖ నటుడు, వైసీపీ నేత మోహన్ బాబు చిక్కుల్లో పడ్డారు. ఆయనకు హైదరాబాద్ లోని ఎర్రమంజిల్ కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. ఓ చెక్కు బౌన్స్ కేసులో ఆయనకు ఈ శిక్ష పడింది. వెంటనే బెయిల్ మంజూరు చేసింది. నలభై లక్షల రూపాయల చెక్ బౌన్స్ కు సంబంధించి 2010లో దర్శకుడు వై వీ ఎస్ చౌదరి కోర్టుకెక్కారు. ఈ కేసును విచారించిన కోర్టు మంగళవారం నాడు ఈ శిక్ష విధించింది. ఈ కేసులో ఏ1గా ఉన్న లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ కు పది వేల రూపాయల జరిమానా, ఏ2గా ఉన్న మోహన్ బాబుకు ఏడాది జైలు శిక్షతో పాటు 41.75 లక్షల రూపాయలు చెల్లించాలని ఆదేశించింది. సలీం సినిమాను వైవీఎఎస్ చౌదరి తెరకెక్కించారు. ఆ సమయంలోనే మోహన్ బాబు ఈ చెక్కును ఆయనకు అందజేశారు. ఇది నగదుగా మారకపోవటంతో చౌదరి 2010లో కోర్టును ఆశ్రయించారు. ఈ కేసును తొమ్మిదేళ్ల పాటు విచారించిన కోర్టు తుది తీర్పు వెలువరించింది.

మోహన్ బాబు 41.75 లక్షలు చెల్లించకపోతే మాత్రం..జైలు శిక్ష మరో మూడు నెలలు పొడిగించాలని ఆదేశించారు. నెల రోజుల్లో ఈ మేరకు చెల్లింపులు చేస్తానని మోహన్ బాబు కోర్టు అనుమతి కోరారు. దీంతో ఆయనకు కోర్టు వెంటనే బెయిల్ కూడా మంజూరు చేసింది. ఈ అంశంపై మోహన్ బాబు ఓ ప్రకటన విడుదల చేశారు. వై వి ఎస్ చౌదరి ఉద్దేశపూర్వకంగానే కేసు వేశారని..కోర్టును తప్పుదారి పట్టించారని ఆరోపించారు. సలీమ్ సినిమా సమయంలో ఈ చెక్ ఇచ్చామని..అయితే సలీం విజయం సాధించకపోవటంతో నెక్ట్స్ ప్రాజెక్టు నిలిపివేశామని తెలిపారు. చెక్ వేయవద్దని చెప్పినా వేసి బౌన్స్ చేశారని ఆరోపించారు. కోర్టు తీర్పును సెషన్స్ కోర్టులో ఛాలెంజ్ చేస్తామని వెల్లడించారు.

 

Similar News