హైదరాబాద్ ఇంట్లో దొంగతనం జరిగితే ఏపీలో కేసు పెడతారా బాబూ?

Update: 2019-03-06 13:04 GMT

డేటా చోరీపై ప్రధాన ప్రతిపక్షం వైసీపీ దూకుడు పెంచింది. ఈ వ్యవహారంపై ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి బుధవారం నాడు హైదరాబాద్ లో గవర్నర్ నరసింహన్ ను కలసి ఫిర్యాదు చేశారు. అనంతరం జగన్ మీడియాతో మాట్లాడుతూ రాబోయే రోజుల్లో సీఈసీని కూడా కలసి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. గవర్నర్ కు సీఎం చంద్రబాబునాయుడు చేసిన పనిని వివరించామని తెలిపారు. దేశ చరిత్రలో ఇంత పెద్ద సైబర్ క్రైమ్ ఎప్పుడూ జరగలేదని జగన్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో ఉన్న చంద్రబాబు ఇంట్లో దొంగతనం జరిగితే అమరావతిలో కేసు పెడతారా? అని జగన్ ప్రశ్నించారు. ఓటర్ల డేటా, కలర్ ఫోటోలతో ఓ ప్రైవేట్ కంపెనీ వద్ద ఎలా ఉంటుంది?.

అది కూడా ఆధార్ వివరాలు..ఇవ్వకూడని డేటా అంతా వాళ్ళకు ఎలా చేరింది?.బ్యాంక్ ల ఖాతా వివరాలు ఎలా వచ్చాయి?.సేవా మిత్ర పేరుతో ట్యాబ్ లు ఇఛ్చి సర్వేలకు పంపుతున్నారని..ఎవరైనా టీడీపీకి ఓటు వేయం అని చెపితే వాళ్ళ ఓట్లను తొలగిస్తున్నారని జగన్ ఆరోపించారు. చంద్రబాబు ఇలాంటి అన్యాయం చేస్తారనే భయం తమకు మొదట నుంచి ఉందని జగన్ వ్యాఖ్యానించారు. తాము ఓటర్ల జాబితాను పరిశీలిస్తే 56 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయని..ఇదే అంశాన్ని సీఈసీకి కూడా ఫిర్యాదు చేశామని వెల్లడించారు. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా కొత్తగా మరో మూడు లక్షల దొంగ ఓట్లు పెరిగాయని తెలిపారు.

 

 

Similar News