మోడీ మరో మోసం..రైల్వే జోన్ పై చంద్రబాబు

Update: 2019-02-28 05:37 GMT

ఏపీకి రైల్వే జోన్ ప్రకటన ను తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రధాని మోడీ చేసిన మరో మోసంగా అభివర్ణించారు. ఒడిశాకు కార్గో రాబడి, ఏపీకి కేవలం ప్రయాణికుల ద్వారా రాబడి మాత్రమే వచ్చేలా చేశారని విమర్శించారు. దీని ద్వారా ఏపీకి ఏడు వేల కోట్ల రూపాయల రాబడి పొగొట్టారని ఆరోపించారు. గురువారం ఉదయం పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. రిక్రూట్ మెంట్లు ఏపీకన్నా ఒడిశాకే ఎక్కువ ఉంటాయని, ఎవరిని మోసం చేయటానికి ఈ ప్రకటన అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

విశాఖ రైల్వే జోన్ ప్రకటనతో బిజెపి దుర్మార్గం మరోసారి బయటపడిందని ధ్వజమెత్తారు. బిజెపి మోసాన్ని అందరూ ఖండించాలని...కేంద్రం మోసానికి నిరసనగా ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా నల్లజెండాలు, నల్ల బెలూన్లు, నల్ల చొక్కాలతో ప్రదర్శనలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. జోన్ ప్రకటనపై వైసీపీ, బిజెపిలు సంతోషం వ్యక్తం చేయటం దారుణమన్నారు. ఏపీలో అడుగుపెట్టే హక్కు మోడీకిలేదని..హామీలు అన్నీ నేరవేర్చాకే రావాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు. జగన్ అమరావతిలో గృహ ప్రవేశం చేసి ఒక్క రోజు కూడా ఉండకుండానే మళ్ళీ హైదరాబాద్ వెళ్లిపోయారని..నిలకడగా ఆయన ఏపీలో నివాసం ఉండరని విమర్శించారు.

Similar News