చంద్రబాబు..పవన్ మళ్ళీ కలిస్తే!

Update: 2019-01-03 03:47 GMT

వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మళ్లీ జట్టుకడితే ఏమి అవుతుంది?. ఇదీ ఏపీ రాజకీయాల్లో హాట్ హాట్ చర్చ. బిజెపితో కలసి ప్రధాని మోడీ చెప్పినట్లు ఆడుతున్నాడని పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన చంద్రబాబునాయుడు సడన్ గా పవన్ తో పొత్తు ఎందుకు కోరుతున్నారు?. తాము ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన తర్వాతే పవన్ తమపై విమర్శలు చేస్తున్నాడని.. మోడీతో కలసి ఉన్నంత వరకూ పవన్ ఏమీ మాట్లాడలేదని సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ లు పదే పదే ప్రకటించారు. ఏపీ మంత్రులదీ అదే దారి. మరి ఇప్పుడు టీడీపీ నేతలు...స్వయంగా చంద్రబాబునాయుడు చెప్పినట్లు బిజెపితో కలసి ఉన్న పవన్ సాయం కోరటంలో మతలబు ఏమిటి?. వచ్చే ఎన్నికల్లో పవన్ సాయం లేకుండా గట్టెక్కలేమనే భావనలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఉన్నారా?. ఇవే అనుమానాలు టీడీపీ శ్రేణుల్లోనూ వ్యక్తం అయ్యే పరిస్థితులు స్వయంగా చంద్రబాబునాయుడే కల్పిస్తున్నారని ఓ టీడీపీ నేత వ్యాఖ్యానించారు.

పార్టీ పెట్టి..ఎన్నికల బరిలో నిలవకుండా గత ఎన్నికల్లో టీడీపీ, బిజెపిలకు మద్దతు ఇచ్చి ఓ కొత్త చరిత్ర సృష్టించిన జనసేన ఇప్పుడు చంద్రబాబుతో కలవటం అంత సులభంగా జరుగుతుందా?. చంద్రబాబు పొత్తు వ్యాఖ్యలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడా నోరుతెరిచి మాట్లాడటం లేదు?. అయితే ఇంత కాలం ఏపీ ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ లు భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారని...తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసిన పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తుకు సై అంటే..మరి ఆయన గతంలో చేసినన విమర్శలకు ఏమి సమాధానం చెబుతారు?. అన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. తాను మద్దతు ఇచ్చింది మెరుగైన పాలన అందిస్తారనే కానీ...అడ్డగోలుగా అవినీతి చేస్తారని కాదంటూ పవన్ పదే పదే ప్రకటించారు. మరి ఇప్పుడు పాత విమర్శలను వదిలేసి వీరిద్దరూ కలిస్తే ప్రజలకు ఏమి సమాధానం చెబుతారు?.

బిజెపితో కలసిన పవన్ ను కలుపుకున్న అంశంపై టీడీపీ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. చంద్రబాబు, లోకేష్ ల అవినీతిపై విమర్శలు చేసిన పవన్ మళ్లీ అలాంటి అవినీతిపరులతో ఎందుకు జట్టు కట్టారో ప్రజలకు వివరించాల్సి ఉంటుంది. అయితే రాజకీయ నాయకులు ఈ నియమాలను ఏ మాత్రం పట్టించుకోరన్న సంగతి అందరికీ తెలిసిందే. తాము ఏమి చేసినా ప్రజాస్వామ్య..దేశ, రాష్ట్ర శ్రేయస్సుల కోసమే అని చెప్పటంలో నేతలు దిట్ట. మరి తాజా పరిణామాలపై ప్రజలు ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సిందే. చంద్రబాబు వ్యాఖ్యలపై పవన్ ఇప్పటివరకూ స్పందించకపోవటం కూడా ఆ పార్టీకి మరింత నష్టం చేస్తుందనే అభిప్రాయం జనసేన వర్గాల్లో వ్యక్తం అవుతోంది. చంద్రబాబు వ్యాఖ్యలు..పవన్ మౌనం ఇప్పటికే జనసేనకు చేయాల్సిన నష్టం చేశాయనే ఆ అభిప్రాయం ఆ పార్టీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది.

 

 

Similar News