నవనిర్మాణ..ధర్మపోరాట దీక్షల ప్రసంగమే ‘వైట్ పేపర్’

Update: 2018-12-23 07:18 GMT

నాలుగు సంవత్సరాల పాటు నవ నిర్మాణ దీక్షల్లో చెప్పింది అదే. ఆ తర్వాత ధర్మ పోరాట దీక్షల్లో చెప్పిందీ అవే అంశాలు. కాకపోతే బిజెపితో కలసి ఉన్నంత కాలం విభజన చేసిన కాంగ్రెస్ పై దాడి. ఎన్డీయే నుంచి బయటికి వచ్చిన తర్వాత ఇప్పుడు బిజెపిపై దాడి. కాంగ్రెస్ పై ప్రేమ. తేడా అదొక్కటే. అంతా సేమ్ టూ సేమ్ అన్నట్లు ఉంది ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ప్రకటించిన ‘వైట్ పేపర్’ తీరు. ఏపీకి బిజెపి అన్యాయం చేసిందనటంలో ఎవరికీ సందేహం లేదు. విభజన హామీలను ఆ పార్టీ విస్మరించింది. మరి నాలుగు సంవత్సరాల పాటు ఆ పార్టీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు, టీడీపీ మంత్రులు..అంతా సవ్యంగా ఉన్న రోజుల్లో కూడా ‘కడప స్టీల్ ప్లాంట్’ మొదలుకుని ఏ అంశాన్ని కూడా సాధించలేకపోయారు. ఏకంగా రాజ్యసభ సాక్షిగా అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీ ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబునాయుడు ఎన్నిసార్లు మాటలు మార్చారో అందరూ చూశారు. కానీ చివర్లో చంద్రబాబునాయుడే యూటర్న్ తీసుకుని మళ్ళీ ప్రత్యేక హోదా నినాదాన్ని అందుకున్నారు.

ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో పాత విషయాలను పక్కన పెట్టేసి తాను అత్యంత స్వచ్చంగా..తెరిచన పుస్తకంలా ‘వైట్ పేపర్’లు విడుదల చేస్తున్నట్లు చెప్పుకునేందుకే ఈ ఎత్తుగడ. వైట్ పేపర్ తో చంద్రబాబు చెప్పిన అంశాల్లో కొత్త అంశం ఒక్కటంటే ఒక్కటీ లేదు. కోట్లాది రూపాయల ప్రభుత్వ సొమ్ము వెచ్చించి చేస్తున్న నవ నిర్మాణ, ధర్మపోరాట దీక్షల్లో చెబుతున్న అంశాలనే చంద్రబాబు వైట్ పేపర్ రూపంలో తెచ్చారు. ఆ సమయంలో ఎప్పటిలాగానే రాజకీయ విమర్శలూ చేశారు. ఏపీ విషయంలో బిజెపి దుర్మార్గం దారుణంగా ఉందని..దాన్ని సహించబోమని చంద్రబాబు ప్రకటించారు. కావాలనే కేంద్రం తమపై వివక్ష చూపిస్తోందని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా విషయంలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) యూటర్న్ తీసుకుంటే జగన్, పవన్ ఆ పార్టీకి మద్దతు ఇస్తారా? అని ప్రశ్నించారు. హోదా తెలుగువారి ఆత్మగౌరవానికి నిదర్శనం అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

 

Similar News