వైఎస్ జగన్ పై కత్తితో దాడి..ఏపీలో కలకలం

Update: 2018-10-25 09:46 GMT

ఊహించని పరిణామం. ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై కత్తితో దాడి. అదీ విమానాశ్రయంలో. ఈ కత్తి దాడిలో జగన్ చేతికి గాయం కావటంతో పాటు రక్తస్రావం జరిగింది. విమానాశ్రయంలో జగన్ తో సెల్ఫీ దిగేందుకు అంటూ వచ్చిన ఓ యువకుడు కోళ్ళకు కట్టే చిన్న కత్తితో ఆయనపై దాడి చేశాడు. ఈ హఠాత్ పరిణామంతో జగన్..పక్కనున్న వాళ్ళు కూడా ద్రిగ్భాంతికి గురయ్యారు. వెంటనే దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడి చేసిన వ్యక్తిని ఎయిర్‌పోర్ట్‌లోని ఓ రెస్టారెంట్‌లో పనిచేస్తున్న వెయిటర్‌ శ్రీనివాస్‌గా గుర్తించారు. దాడి జరిగిన వెంటనే దుండగుడిని సెక్యూరిటీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.

పాదయాత్ర ముగించుకొని వైఎస్‌ జగన్‌ గురువారం హైదరాబాద్‌ తిరిగి వచ్చేందుకు విశాఖపట్నం విమానాశ్రయం వచ్చారు. ఈ సందర్భంగా ఆయన వీఐపీ లాంజ్‌లో ఉండగా.. శ్రీనివాస్‌ అనే వెయిటర్‌.. సెల్ఫీ తీసుకుంటానంటూ వైఎస్‌ జగన్‌ వద్దకు వచ్చారు. అతను వస్తూనే.. వైఎస్‌ జగన్‌పై కోళ్ల పందెలకు ఉపయోగించే కత్తితో దాడి చేశాడు. ఈ సమయంలో అప్రమత్తంగా ఉన్న వైఎస్‌ జగన్‌ సహాయకులు దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో వైఎస్‌ జగన్‌ భుజానికి తీవ్ర గాయమైంది. కత్తికి విషపూరిత పదార్థం పూసి ఉండవచ్చునని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తీవ్ర గాయం కావడంతో ప్రాథమిక చికిత్స అనంతరం వైఎస్‌ జగన్‌ హైదరాబాద్‌ బయలుదేరారు. హైదరాబాద్ చేరుకున్న వెంటనే జగన్ వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి వెళ్ళారు.

 

 

Similar News