ఔటర్ రింగు రోడ్డుతో అధికార పార్టీ ఆటలు!

Update: 2018-09-01 04:50 GMT

హైదరాబాద్ కు మణిహారం అయిన ఔటర్ రింగు రోడ్డు (ఓఆర్ఆర్)తో అధికార టీఆర్ఎస్ పార్టీ ఆడుకుంటోంది. ఆదివారం నాడు కొంగరకలాన్ లో ఆ పార్టీ నిర్వహించే భారీ బహిరంగ సభ కోసం ఔటర్ కు తూట్లు పొడుస్తున్నారు. పలు చోట్ల నిబంధనలకు విరుద్ధంగా రింగు రోడ్డు నుంచి నేరుగా సభకు వెళ్లే ప్రాంతాలకు మట్టితో ర్యాంప్ లు ఏర్పాటు చేశారు. సభ తర్వాత వాటిని తామే తొలగిస్తామని టీఆర్ఎస్ చెబుతోంది.. ఈ క్రమంలో ఇప్పటికే ఔటర్ చుట్టూ ఉన్న గ్రీనరీ కూడా భారీగా దెబ్బతింటోంది. ఏకంగా టీఆర్ఎస్ సభ కోసం సుమారు పది చోట్ల ఇలా మట్టి ర్యాంప్ లు ఏర్పాటు చేసి..ఔటర్ రింగు రోడ్డుపై వచ్చే వాహనాలు సభా ప్రాంగణాలకు వెళ్ళే వెసులుబాటు కల్పించారు. టీఆర్ఎస్ సభ పెట్టుకోవటంపై ఎవరికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. కానీ అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్టును రాజకీయ అవసరాల కోసం ఇష్టానుసారం చేయటం సరికాదనే విమర్శలు విన్పిస్తున్నాయి.

ఈ ప్రాజెక్టును నిర్వహించే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) మాత్రం చోద్యం చూస్తూ కూర్చుంది. అదేమంటే టీఆర్ఎస్ పార్టీనే పోయిన మొక్కలతోపాటు..మట్టి ర్యాంప్ లను తొలగిస్తుందని ప్రకటించేశారు హెచ్ఎండీఏ కమిషనర్ జనార్ధన్ రెడ్డి. ఇదంతా ఒకెత్తు అయితే..ఔటర్ పై నిత్యం 80 వేల నుంచి లక్ష వాహనాలు తిరుగుతాయి. సహజంగా ఔటర్ పై ట్రాక్టర్ల వంటి వాహనాలను అనుమతించరు. కానీ ఇఫ్పుడు ట్రాక్టర్లను కూడా అనుమతిస్తున్నారు. సభ ముందు కానీ..తర్వాత కానీ...ఇలాంటి వాహనాల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం లేకపోలేదని ఓ అధికారి వ్యాఖ్యానించారు. ఓ రాజకీయ పార్టీ సభ కోసం ఇలా నిబంధనలకు తూట్లు పొడవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు.

Similar News