అందనంత దూరానికి..‘అందరివాడు’

Update: 2018-08-16 16:17 GMT

వాజ్ పేయి. అందరివాడు. బిజెపిని విపరీతంగా తిట్టేవారిలోనూ వాజ్ పేయిను పల్లెత్తి మాట అనటానికి సాహసించని వారెందరో. అంతలా ప్రభావం చూపారు ఆయన. దేశంలో రాజకీయ నాయకులు చాలా మందికి వాజ్ పేయి ఆదర్శం. ఆయన మార్గం ఆచరణీయం. తప్పు చేసింది తన వాళ్ళు అయినా సరే...దాన్ని సరిదిద్దాలనే తత్వం. అందుకే వాజ్ పేయి అంటే అందరికి ఇష్టం. అందరికీ ఇష్టమైన ఆ ‘భారత రత్నం’ ఇక కన్పించదు. గత కొంత కాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న మాజీ ప్రధాని వాజ్ పేయి గురువారం సాయంత్రం కన్నుమూశారు. వాజ్ పేయి మరణవార్తతో దేశం యావత్తూ ద్రిగ్భాంతికి గురైంది. ప్రస్తుతం దేశంలో విలువలతో కూడిన రాజకీయాలు చేసిన అతికొద్ది మందిలో వాజ్ పేయి ఒకరు. అందుకే అంతగా స్పందిస్తున్నారు ఆయన మరణంపై అందరూ. అలుపెరుగని ఈ రాజకీయ నాయకుడికి 1994 లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు లభించింది. మొదటి కాంగ్రేసేతర ప్రభుత్వమైన మొరార్జీ దేశాయ్ మంత్రివర్గంలో విదేశీ వ్యవహారాల శాఖను నిర్వహించారు. అనారోగ్య కారణాలవల్ల ఆయన కొన్నేళ్ల క్రితం క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఆయన దేశానికి చేసిన విశేష సేవలకు గానూ భారత ప్రభుత్వం డిసెంబర్ 24, 2014లో భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది. ఆయన పుట్టినరోజు అయిన డిసెంబర్ 25 ను సుపరిపాలనా దినంగా భారత ప్రభుత్వం ప్రకటించింది. 1968 నుంచి 1973 వరకు జనసంఘ్ పార్టీకి అధ్యక్షుడిగా పనిచేసి, 1980 నుండి 1986 వరకు భారతీయ జనతా పార్టీకి వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేశారు.

1996 లో మొదటిసారిగా ప్రధానమంత్రి పదవీయోగం లభించినా అది 13 రోజులకే పరిమితమైంది. 1998 లో రెండోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి కేవలం 13 నెలలు మాత్రమే ఆ పదవిలో కొనసాగారు. తరవాత 1999 లో కొలువుదీరిన 13 వ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించి మరోసారి దేశ ప్రధానమంత్రి అయ్యారు. 2004 వరకు ఆ పదవిలో కొనసాగారు. వాజ్‌పేయి మృతి పట్ల రాజకీయ నేతలు, ప్రముఖులు, విదేశీ నేతలు సంతాపం ప్రకటిస్తున్నారు. వాజ్‌పేయిని చివరి చూపు చూసేందుకు ఇప్పటికే దేశ నలుమూలల నుంచి రాజకీయ ప్రముఖుల, అభిమానులు ఢిల్లీకి తరలివస్తున్నారు. వాజ్‌పేయి మరణంతో ఆగస్టు22 వరకు సంతాపదినాలుగా పాటించనున్నారు. వాజ్ పేయి అంత్యక్రియలు శుక్రవారం నాడు జరగనున్నాయి.

Similar News