తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కెసీఆర్ కు ఎన్ని చేసినా గెలుపుపై నమ్మకం కుదరటం లేదా?. ఓ వైపు ‘రైతు బంధు’ పథకం పేరుతో ఎకరాకు నాలుగు వేల రూపాయలు పంట సాయం కింద ఇస్తూ...మళ్లీ ఇప్పుడు తాజాగా ‘ఉచిత యూరియా’ గురించి ఆలోచించటం వెనక మతలబు ఏమిటి?. రైతుబంధు పథకం కింద ఇఛ్చేదే ఎరువులు...విత్తనాలు కొనుగోలు చేయటానికి కదా?. ఈ పథకం ప్రకటించినప్పుడు తొలుత ఒక పంటకే అన్నారు. ఆ వెంటనే తూచ్..రెండు పంటలకు అని తేల్చారు. రైతులకు సాయం చేయటాన్ని ఎవరూ తప్పుపట్టరు కానీ..కెసీఆర్ ధోరణి చూస్తుంటే ఇది కేవలం ఎన్నికల్లో గెలుపు కోసమే ఇలా చేస్తున్నట్లు ఉందనే విపక్షాల విమర్శలకు బలం చేకూర్చేదిగా ఉంది. పైకి మేకపోతు గాంభీర్యం ప్రకటిస్తున్నా కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే ఓకేసారి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని ఇఛ్చిన హామీ కెసీఆర్ ను ఓ చోట నిలవనీయటం లేదు. అందుకే వరస పెట్టి రైతు బంధులు...ఉచిత యూరియాలు అంటూ ముందుకొస్తున్నారు. ఒక్క ఈ పథకంతోనే ఆగిపోయారు అనుకుంటే పొరపాటే. బీసీల రుణాల విషయంలోనూ అదే తీరు.
బీసీ యువత చేసుకునే వ్యాపారాలకు సాయం చేసేందుకు సర్కారు ఈ పథకం ప్రవేశపెట్టింది. ఉదాహరణకు బీసీలకు ఇచ్చే రుణాల్లో కొంత భాగం సబ్సిడీ ..మిగతా మొత్తం బ్యాంకు రుణం ఉంటుంది. కానీ ఇప్పుడు అవన్నీ తీసేసి బీసీలకు వెసులుబాటును బట్టి లక్ష రూపాయలు లేదంటే 50 వేల రూపాయలను నేరుగా లబ్దిదారులకు ఇవ్వనున్నారు. ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సిన అవసరం కూడా ఉండదు. ఎన్నికల సమయంలో ఈ తరహా ప్రయోగం చేయటం వెనక కారణాలు ఊహించటం పెద్ద కష్టం కాబోదు. ఓవైపు ఏ సర్వే చూసినా తమకు వంద సీట్లు తక్కువ కాకుండా వస్తున్నాయని నమ్మబలుకుతూ ఇంత హైరానా ఎందుకు పడుతున్నట్లు?. కెసీఆర్ హైరానా చూసి అనుమానం లేని వాళ్ళకు కూడా తమ గెలుపుపై అనుమానాలు వచ్చేలా ఉన్నాయని ఓ నేత వ్యాఖ్యానించారంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు.