పవన్ పై జగన్ విమర్శలు..వైసీపీ శ్రేణులకు షాక్!

Update: 2018-07-25 07:46 GMT

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రజల్లో కంటే..వైసీపీలోనే పెద్ద దుమారం రేపుతున్నాయి. ఏదైనా రాజకీయ విమర్శలు అయినా పెద్ద నష్టం ఉండేది కాదు కానీ...పవన్ పై వ్యక్తిగత విమర్శలు చేయటంపై వైసీపీ శ్రేణులు అవాక్కు అయ్యాయి. ఇది పార్టీకి లాభం కంటే నష్టమే ఎక్కువ చేస్తోందనే అభిప్రాయంతో పార్టీ నేతలు కూడా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబును ఢీకొట్టాలంటే వైసీపీకి జనసేనతో పొత్తు అవసరం అని చాలా మంది నేతలు పార్టీ అధినేత వద్ద కూడా వ్యాఖ్యానించినట్లు వైసీపీ వర్గాల్లోనే ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ గత కొంత కాలంగా రాష్ట్రమంతటా పర్యటిస్తూ...ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. వైసీపీ విమర్శల కంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలు చాలా వరకూ ప్రజల్లోకి వెళ్ళాయనే అభిప్రాయం ఉంది. ఈ తరుణంలో జగన్ ఆకస్మికంగా పవన్ పై వ్యక్తిగత విమర్శలు చేసి..అనవసర వివాదంలోకి దిగినట్లు అయిందని ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నాయి.

వైసీపీలో ఎక్కువ మంది మాత్రం పవన్ పై జగన్ విమర్శలు చేయకుండా ఉండాల్సిందనే అభిప్రాయంతోనే ఉన్నారు. ఈ పరిణామాలతో అధికార టీడీపీలో సంతోషం వెల్లివిరుస్తోంది. వాస్తవానికి టీడీపీ గత కొంత కాలంగా ఎక్కడ జనసేన, వైసీపీ కలిస్తే తమ పని గల్లంతు అవుతుందో అన్న భయంతో ఉంది. అయితే జగన్ తాజా విమర్శలతో ఈ పొత్తు అంత తేలిగ్గా కుదిరే వ్యవహారం కాదని...అటు జగన్..ఇటు పవన్ కూడా భిన్నధృవాలు అయినందున వీరి కలయిక సాధ్యం అవుతుందా? అన్న అంశంపై కూడా చర్చ సాగుతోంది. మొత్తానికి అవసరం లేని చోట జగన్ కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చి వైసీపీ శ్రేణులనే నిశ్చేష్టులను చేశారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. రాజకీయంగా ఎంతో బద్ధశత్రువులైన కాంగ్రెస్ , టీడీపీలు పొత్తు పెట్టుకోవటానికి రెడీ అవుతుంటే..ఈ వ్యాఖ్యలు పెద్ద అడ్డంకిగా ఉంటాయా? అనే అనుమానం కూడా వ్యక్తం అవుతోంది. అయితే రాజకీయాల కోసం ఏదైనా చేసే వ్యక్తి చంద్రబాబు. కానీ జగన్..పవన్ లది విభిన్న మనస్తత్వం. వీరు అంత తేలిగ్గా కలవగలుగుతారా?. చూడాల్సిందే?.

 

Similar News