రాజధాని కట్టలేని చంద్రబాబు..ఒలింపిక్స్ నిర్వహిస్తారట

Update: 2018-07-25 05:14 GMT

నాలుగేళ్ళలో ఏపీ నూతన రాజధానిలో నాలుగు శాశ్వత భవనాలు కట్టలేని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విచిత్ర వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. డిజైన్ల ఖరారుకే ఆయన దాదాపు మూడేళ్ల సమయం తీసుకున్నారు. తాజాగా చంద్రబాబు ఒలింపిక్స్ నిర్వహణపై చేసిన వ్యాఖ్యలు చూసి అధికార వర్గాలు సైతం విస్తుపోతున్నాయి. 2020లో ఒలింపిక్స్ జపాన్ రాజధాని టోక్యోలో జరగనున్నాయి. ఈ ఒలింపిక్స్ నిర్వహణకు అయ్యే వ్యయం సుమారు 1.20 లక్షల కోట్ల రూపాయలు పైనే ఉంటుందని అంచనా. జపాన్ వంటి దేశమే వ్యయం ఎలా తగ్గించుకోవాలి అనే అంశంపైనే తర్జనభర్జనలు పడుతోంది. ఈ నిర్వహణ వ్యయంలో అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ సగంపైన వ్యయాన్ని భరిస్తుంది. మిగిలిన మొత్తం ఆయా దేశాలు సొంతంగా పెట్టడంతోపాటు...లైవ్ హక్కులు.?ఇతర ప్రకటనలు వంటి మార్గాల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకుంటారు. అసలు భారత్ వంటి దేశమే ఒలింపిక్స్ కు బిడ్డు వేయాలంటే భారీ ఎత్తున మౌలికసదుపాయాలను అభివృద్ధి చేసుకోవాల్సి ఉంటుంది.

అలాంటిది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏకంగా దేశంలోనే తొలి ఒలింపిక్స్ ఏపీలోనే నిర్వహిస్తామంటూ వ్యాఖ్యానించటంతో అధికారులు కూడా నవ్వుకుంటున్నారు. ఒలింపిక్స్ నిర్వహణకు ఎన్ని మౌలికసదుపాయాలు కావాలి..ఎన్ని వేల కోట్ల రూపాయలు కావాలి అనే అంశాలను పూర్తిగా విస్మరించేసి చంద్రబాబు బహిరంగ సభల్లో ఏది వస్తే అది మాట్లాడుతూ తన పరువు తానే తీసుకుంటున్నారని ఓ సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు. ఓ రెండు అంతర్జాతీయ స్థాయి క్రీడా ప్రాంగణాల ఏర్పాటుతో ఇది సరిపోతుందా?. ఒలింపిక్స్ నిర్వహణకు వీలుగా ...ఆ దిశగా మౌలికసదుపాయాలు మెరుగుపరుస్తామని చంద్రబాబు ప్రకటించారు. అంత డబ్బు ప్రస్తుతం ఏపీ వద్ద ఉందా?.

 

Similar News