మాట్లాడితే వంద సీట్లు. కొన్ని సర్వేల్లో అయితే 103 దాకా వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపు గ్యారంటీ. ఇదీ ముఖ్యమంత్రి కెసీఆర్ నుంచి మంత్రి కెటీఆర్ వరకూ గత కొన్ని రోజులుగా విన్పిస్తున్న మాటలు. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయనే సంకేతాలు వెలువడ్డాయి. అది కూడా సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కెసీఆర్ నుంచే కావటంతో వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు షాక్ తప్పదా? అనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. సాక్ష్యాత్తూ సీఎం కెసీఆరే అధికార పార్టీకి చెందిన 39 మంది నియోజకవర్గాల్లో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయని..దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే అంతే సంగతులు అని హెచ్చరికలు జారీ చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన జోష్ లో...ఉద్యమ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ గత ఎన్నికల సమయంలో కేవలం 63 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తర్వాత రాజకీయ పునరేకీకరణ పేరుతో అడ్డగోలుగా ఫిరాయింపులను ప్రోత్సహించి ఆ సంఖ్యను 90కు చేర్చుకున్నారు. టీఆర్ఎస్ సొంత బలం 63 ప్రకారం 39 మందికి గెలుపు ఛాన్స్ తక్కువ ఉండే టీఆర్ఎస్ ఫిగర్ 24కు పడిపోతుంది. పోనీ 90 మందితో లెక్కిస్తే 51కి పడిపోతుంది. ఏ లెక్కన చూసుకున్నా వచ్చే ఎన్నికలు తెలంగాణలో అధికార టీఆర్ఎస్ కు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయనే విషయాన్ని తాజా సర్వేలు తేల్చిచెప్పినట్లు వెల్లడవుతోంది. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘రైతు బంధు’ పధకం ప్రారంభించిన తర్వాత సర్వేలోనూ ఈ ఫలితాలు రావటం అధికార పార్టీ నేతలను విస్మయానికి గురిచేస్తోంది.
కెసీఆర్ అసలు పరిస్థితి గ్రహించే వరస పెట్టి స్కీమ్ లు ప్రకటిస్తూ రైతులు..ప్రజలను ఆకర్షించే పనిలో ఉన్నారని చెబుతున్నారు. అయినా కూడా పరిస్థితుల్లో మార్పు రాకపోవటం ఆసక్తికరంగా మారింది. రైతు బంధు పథకంతో గ్రామీణ ప్రాంతాల్లోని పేద రైతుల కంటే సంపన్న రైతులకు ఎక్కువ ప్రయోజనం చేకూరటం..అసలైన వ్యవసాయదారులుగా ఉన్న కౌలు రైతులను ఏ మాత్రం పట్టించుకోకపోవటం సర్కారుకు వ్యతిరేకంగా మారే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇంత కాలం వంద సీట్లకు పైగా సాధిస్తామని చెబుతున్న కెసీఆర్ కు తాజా పరిణామం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ప్రజల వ్యతిరేకత ఎదుర్కొంటున్న 39 మంది ఎమ్మెల్యేలు ఈ నాలుగేళ్లలో కూడగట్టుకున్నవ్యతిరేకతను..ఏడాది లోపు పొగొట్టుకుని ట్రాక్ లోకి రాగలరా?. ఆయా స్థానాల్లో అభ్యర్థులను మార్చితే సిట్టింగ్ లు చూస్తూ ఊరుకుంటారా?. ఏది ఏమైనా వచ్చే ఎన్నికలు టీఆర్ఎస్ కు అగ్నిపరీక్షగా నిలవటం ఖాయంగా కన్పిస్తోంది. ఫిరాయింపుదారులను ప్రజలు వచ్చే ఎన్నికల్లోనూ స్వాగతిస్తారా?. వేచిచూడాల్సిందే.