‘పరకాల’ మహాత్యాగం పదిహేను రోజులే

Update: 2018-06-20 03:57 GMT

అధికార తెలుగుదేశం పార్టీది ఎంత గొప్ప త్యాగం. ఎంత పెద్ద నాటకం. ఏపీ ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ ది అయితే ‘మహా త్యాగం’. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు 1476 ప్రకారం ఆయన పదవీ కాలం వచ్చే నెల నాలుగుతో ముగియనుంది. అంటే ఇంకా నిండా 15 రోజులు కూడా లేదు. దీనికి పెద్ద త్యాగాల కలరింగ్...టీడీపీ హంగామా. ఇందులో మళ్ళీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కొత్త ట్విస్ట్. ఆయన ప్రభుత్వంలోనే సలహాదారు బాధ్యతలు మాత్రమే నిర్వహిస్తున్నారు అని. అసలు పరకాల పార్టీ సభ్యుడే కాదు..అయినప్పుడు మహానాడులో తీర్మానాలు ఎలా ప్రవేశపెట్టారు. డయాస్ పై ఎలా కూర్చున్నారు? వీటికి టీడీపీ నాయకుల నుంచి సమాధానాలు ఉండవు.

మామూలుగా ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గతంలో చాలాసార్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై పరుష పదజాలం వాడారు. కానీ పరకాల విషయానికి వస్తే...అలాంటిది ఏమీ జరగలేదు. చంద్రబాబు ఓ పక్క బిజెపిపై పోరాటం అంటారు..మరో వైపు తన పక్కనే కేంద్ర రక్షణ శాఖ మంత్రి భర్త పరకాల ప్రభాకర్ ను సలహాదారుగా పెట్టుకుంటారు అని వ్యాఖ్యానించారు. అందులో అభ్యంతరకరమైన అంశాలు కూడా ఏమీలేవు. అయితే దీనికి టీడీపీ ఇచ్చిన కలరింగ్ మాత్రం విచిత్రం. జగన్ వ్యాఖ్యలతో పరకాల మనస్థాపం చెందారని..అందుకే రాజీనామా చేశారని ప్రచారం చేయటం ద్వారా మైలేజ్ పొందాలని చూశారు. కానీ అసలు విషయం చూస్తే ఇంకో పది..పదిహేను రోజుల్లో ఉద్యోగం పోతుందని తెలిసి రాజీనామా చేసిన చందంగా పరకాల వ్యవహారం ఉంది. ఈ తరహా సీన్లు రక్తికట్టించాలంటే ఎవరైనా టీడీపీ తర్వాతే.

Similar News