జగన్ గెలుపు కోసం చంద్రబాబు కృషి చేస్తారా!

Update: 2018-06-16 04:57 GMT

అదేంటి?. నిత్యం ప్రతిపక్ష నేత జగన్ పై విరుచుకుపడే చంద్రబాబు ఆయన గెలుపు కోసం కృషి చేయటం ఏమిటి అంటారా?. ఏమో చంద్రబాబు మాటలు చూసి అలా అనుకోవాల్సిందే మరి. వైసీపీ, బిజెపి, జనసేన కలసి ఏపీలో టీడీపీని ఓడించాలని చూస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ తో పాటు అందరి నోటా అదే మాట. ఏ పార్టీ అయినా ప్రత్యర్థి పార్టీని ఓడించటానికి ప్రయత్నించక గెలిపించటానికి ప్రయత్నిస్తుందా?. అసలు ఆ విమర్శల్లో ఏ మాత్రం అయినా హేతుబద్దత ఉందా?. చంద్రబాబు తాను గెలవటానికి ప్రయత్నిస్తాడా? లేక జగన్ గెలుపు కోసం కృషి చేస్తాడా?. జగన్ అయినా ..మరో నేత అయినా సహజంగానే ప్రత్యర్ధి పార్టీని ఓడించగలిగితేనే అధికారంలోకి వస్తారు. నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకు ఇంత సింపుల్ లాజిక్ తెలియదా?.ఇవన్నీ చూస్తుంటే చంద్రబాబులో ఓటమి భయం కొట్టొచ్చినట్లు కనపడుతోందనే అనుమానాలు టీడీపీ నేతల్లోనే వ్యక్తం అవుతున్నాయి.

గత రెండు రోజులుగా టీడీపీలో ఒక్కటే ఉలికిపాటు..కలవరపాటు..వణుకు ఎందుకో అర్థం కావటం లేదు. వైసీపీ ఎమ్మెల్యే, బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి ఢిల్లీలో రామ్ మాధవ్ ను కలిశారో లేదో తెలియదు. కాసేపు చర్చ కోసం కలిశారే అనుకుందాం. పీఏసీ రికార్డులు అందజేశారు అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు టీడీపీ నేతలు. నిజంగా చంద్రబాబు సర్కారు ఎలాంటి స్కామ్ లు..అక్రమాలు చేయకపోతే ఏ కాయితాలు ఇస్తే మాత్రం ఏమి అవుతుంది. రాష్ట్రంలో ఎవరు ఎవరిని కలవాలో చంద్రబాబునాయుడు, టీడీపీ నేతలు డిసైడ్ చేస్తారా?. ఈ మధ్యే రాజ్యసభకు ఎన్నికైన ఓ టీడీపీ నేత తన ఇంట్లో ఇచ్చిన డిన్నర్ కు ఉమ్మడి రాష్ట్రంలో అత్యంత అవినీతిపరుడుగా పేరుగాంచిన నేతతోపాటు..వైసీపీ ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు. అప్పుడు చంద్రబాబుకు అదేమీ తప్పుగా కన్పించలేదు?. అంత అవినీతిపరుడిని డిన్నర్ కు ఎలా పిలుస్తావు అని ఆ ఎంపీని పిలిచి మందలించలేదు. నిజంగా ఏపీలో బిజెపిపై వ్యతిరేకత పీక్ లో ఉంది. వైసీపీ నేతలు బహిరంగంగా...పరోక్షంగా బిజెపితో కలసినట్లు తేలినా అది ఆ పార్టీకే నష్టం చేకూరుస్తుంది. అదే టీడీపీ చేస్తున్న యాగీ చూస్తుంటే మొత్తానికి ఏదో జరుగుతుంది? అని అనుమానం ప్రజల్లో వ్యక్తం అవుతోంది. మాట్లాడితే చంద్రబాబు తనపై కుట్ర చేస్తున్నారు..కుట్ర చేస్తున్నారు అని గగ్గోలు పెడుతున్నారు. అధికారంలో ఉన్న పార్టీపై ప్రతిపక్ష పార్టీ కుట్ర చేయగలదా?. టీడీపీ ఏపీలో అంత వీక్ గా ఉందా?.

ఓడించటానికి ప్రయత్నించటం అనేది రాజకీయ పార్టీల సహజ ధర్మం. ప్రజలు ఎవరి మాట వింటే వారే గెలుస్తారు. మరి అసలు చంద్రబాబుపై జరిగే కుట్ర ఏంటి?. ఆయనలో అంత ఉలికిపాటు ఎందుకు?. ఎవరు ఎవరితో కలవాలో ఆయా వ్యక్తులు నిర్ణయించుకుంటారు. కానీ టీడీపీ నేతలకు మాత్రం ఎక్కడ లేని ఉలికిపాటుకు గురవుతున్నారు. జగన్ రాష్ట్రానికి సహకరించకుండా మోడీకి సహకరిస్తున్నాడని చంద్రబాబు అండ్ కో ఆరోపిస్తోంది. నాలుగేళ్ళు బిజెపి ప్రభుత్వంలో ఉండి కూడా చంద్రబాబు సాధించుకోలేని డిమాండ్లు..ప్రతిపక్ష నేత జగన్ అడిగితే ఓకే చేస్తారా?. అంటే చంద్రబాబు తన కంటే జగన్ బలవంతుడు అని నమ్ముతున్నారా?. బిజెపి విషయంలో జగన్ ఒకింత సాఫ్ట్ కార్నర్ తో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అది ఎందుకో కూడా తెలుసు?. మొత్తం మీద ఏపీలో టీడీపీ ఆగమాగం అవుతున్న తీరు చూస్తే ప్రజల్లో అనుమానాలు రావటం ఖాయం. అయితే టీడీపీ నేతలు మాత్రం తాము బిజెపి, జగన్ ను బాగా బద్నాం చేశాం అనే లెక్కలో ఉన్నారు. ఆ లెక్క తేలాంటే ఎన్నికల వరకూ ఆగాల్సిందే.

 

Similar News