జగన్ అసెంబ్లీలో మళ్ళీ పైపులు కోశారా!

Update: 2018-05-01 14:46 GMT

ఆంధ్రప్రదేశ్ మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ దగ్గరుండి మరీ కట్టించిన ‘అసెంబ్లీ భవనాల’ పరిస్థితి అది. ఒక్క వర్షం కురిస్తే చాలు...జలపాతాల నుంచి నీరు కారినట్లు గదుల్లోకి నీరు వస్తూ ఉంటుంది. ఒక్క వర్షానికే గతంలోనూ ప్రతిపక్ష నేత జగన్ ఛాంబర్లోకి నీరు వచ్చాయి. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావటంతో సర్కారు సీబీసీఐడీ ఎంక్వైరీకి ఆదేశించింది. టీడీపీ అయితే రాజకీయంగా తీవ్ర స్థాయిలో విమర్శలు చేసి...జగన్ మనుషులు ఎవరో భవనంపైన పైపులు కోశారని ఆరోపించింది. విచారణలో నిజం నిగ్గుతేలుతుందని ప్రకటించారు. తర్వాత అసలు ఆ విచారణ ఏమైందో...చర్యలు తీసుకున్నారో లేదో ఎవరికీ తెలియదు.

మళ్ళీ ఇప్పుడు అదే సీన్ రిపీట్ అయింది. ఓ వర్షం దెబ్బకు జగన్ ఛాంబర్లలోకి నీరు ధారగా కారింది. ఇక టీడీపీ నేతలు ఇప్పుడు కూడా జగన్ పైపులు కోశారని చెప్పటం తప్ప...మరో మార్గం ఉండదు మరి. ఎందుకంటే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి కట్టించిన అద్భుతమైన భవనాలు కదా?. అసెంబ్లీలోనే కాదు...సచివాలయం గేట్‌-2 వెయిటింగ్‌ హాల్‌ సైతం వర్షపు నీరు లీకేజీ అవుతోంది. వర్షం వచ్చినప్పుడల్లా సచివాలయం, అసెంబ్లీ భవనాల నాణ్యత ఏపీ ప్రజలకు తెలిసిపోతోంది. కొత్తగా కట్టే రాజధాని భవనాల్లో అయితే జాగ్రత్తలు తీసుకుంటే పరువు పోకుండా ఉంటుందని టీడీపీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు.

Similar News