ఇక గాల్లో ఎగురుతూ...ఫోన్లో మాట్లాడుకోవచ్చు!

Update: 2018-05-02 03:31 GMT

సెల్ ఫోన్ వచ్చిన తొలి రోజుల్లో అది ఓ పెద్ద సంచలనం. అప్పటివరకూ ఫోన్ అంటే ల్యాండ్ లైన్ మాత్రమే. సెల్ ఫోన్ వచ్చాక కమ్యూనికేషన్ వ్యవస్థే మారిపోయింది. కారులో ఎంచక్కా స్పీడ్ గా ప్రయాణిస్తూ ఫోన్ మాట్లాడొచ్చు. ఎక్కడ ఉన్నా ఫోన్ అందుబాటులో ఉంటుంది. ఇది వచ్చి చాలా కాలమే అయిపోయింది. అయితే ఇప్పుడు ఏకంగా గాల్లో ఎగురుతూ కూడా ఫోన్ మాట్లాడుకునే సౌకర్యం అందుబాటులోకి రానుంది. భారతీయ గగనతలంలో విమానాల్లో ప్రయాణిస్తూ ఫోన్లు మాట్లాడుకునేందుకు రంగం సిద్ధం అయింది. త్వరలోనే విమాన ప్రయాణికులు టేకాఫ్ సమయంలో ఇకపై ఫోన్లు స్విచాఫ్‌ చేయడం, ఫ్లయిట్‌ మోడ్‌లో పెట్టాల్సిన పనిలేదు. ఫోన్ అలాగే ఉంచి మాట్లాడుకోవచ్చు. అంతే కాదు..నెట్ సౌకర్యాన్ని కూడా వాడుకోవచ్చు. ఇప్పటికే కొన్ని అంతర్జాతీయ ఎయిర్ లైన్స్ లు ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తున్నాయి. తాజాగా భారత్ లోని టెలికం కమిషన్‌ మంగళవారం ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకొంది. కేంద్ర కేబినెట్‌ ఆమోదం పొందిన వెంటనే ఇది అమలులోకి రానుంది.

ఇంటర్నెట్‌ బ్రౌజింగ్‌కు సంబంధించి చార్జి వసూలు చేసే అవకాశం ఉంది. భారత ఎయిర్‌ స్పేస్‌లో మాత్రమే ఈ సేవలు అందుబాటులో ఉంటాయని టెలికం కార్యదర్శి అరుణ సౌందరరాజన్‌ వెల్లడించారు. టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ట్రాయ్‌) ప్రతిపాదనలన్నింటినీ ఆమోదించినట్లు ఆమె చెప్పారు. విమానాల్లో ఫోన్లు మాట్లాడుకోవడం, వైఫేతో ఇంటర్నెట్‌ బ్రౌజింగ్‌ సేవలు రాబోయే 3, 4 నెలల్లో ప్రారంభమయ్యే విధంగా వేగంగా చర్యలు తీసుకొంటామని వివరించారు. ఈ దిశగా కార్యాచరణ వెంటనే మొదలుపెడతున్నట్లు తెలిపారు. లైసెన్సుల జారీ కోసం ఇన్‌ఫ్లైట్‌ కనెక్టివిటీ ప్రొవైడర్‌ పేరుతో ఒక విభాగాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఇదే విధానం ఓడలకు వర్తిస్తుందని చెప్పారు. లైసెన్స్‌ ఫీజు కింద రూ. 1 మాత్రమే వసూలు చేస్తారు. విమానం 3 వేల అడుగుల ఎత్తులో ఉన్నప్పుడే ఈ సౌకర్యాలు లభిస్తాయి.

 

Similar News