జగన్ పాదయాత్ర@2000 కిలోమీటర్లు

Update: 2018-05-14 13:31 GMT

మండుటెండల్లో ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ముందుకు సాగుతోంది. అయితే ఈ పాదయాత్ర పదవిని అందిస్తుందా? లేదా తేలాలంటే 2019 వరకూ ఆగాల్సిందే. గతంలో వైఎస్ రాజశేఖరెడ్డికి..ఆ తర్వాత చంద్రబాబుకు అధికారాన్ని అందివ్వటంలో పాదయాత్రలు కీలక పాత్ర పోషించాయి. ఇఫ్పుడు జగన్ కూడా అదే పనిలో ఉన్నారు. జగన్ పాదయాత్రలో సోమవారం నాడు కీలక పరిణామం చోటుచేసుకుంది. 2017 నవంబర్ ఆరున ఇడుపులపాయలో ప్రారంభం అయిన జగన్ పాదయాత్ర 2018 మే 14న పశ్చిమ గోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. అంతే కాదు..పాదయాత్రలో అత్యంత కీలకఘట్టమైన 2000 కిలోమీటర్ల మైలురాయిని దాటింది. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నియోజకవర్గంలోని వెంకటాపురం వద్ద ప్రజాసంకల్పయాత్ర 2000 కిలోమీటర్ల మైలురాయిని చేరుకున్న సందర్భంగా 40 అడుగుల పైలాన్‌ను ఆవిష్కరించారు. జగన్ ఈ మైలురాయికి గుర్తుగా ఒక కొబ్బరిమొక్కను నాటారు.

జగన్ తన పాదయాత్రలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతోపాటు...ప్రభుత్వంలో చోటుచేసుకున్న అవినీతి, అక్రమాలను బహిర్గతం చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఏలూరులో జరిగిన బహిరంగ సభలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జగన్ పాదయాత్రపై అధికార పార్టీ నేతలు విమర్శలు చేస్తుండగా..ప్రతిపక్ష నేత మాత్రం ప్రభుత్వాన్ని ముఖ్యంగా చంద్రబాబు, మంత్రి లోకేష్ ల అవినీతిని టార్గెట్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అదే సమయంలో ఏ నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యే అక్రమాలను ప్రస్తావిస్తూ పార్టీలో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఈ తరుణంలో జగన్ పాదయాత్ర ద్వారా నిత్యం ప్రజల్లో ఉండటం కూడా కలసి వచ్చే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

 

Similar News