‘తమరు’ శ్రీరాముడిలాంటోరండి చంద్రబాబుగారూ!

Update: 2018-05-10 04:11 GMT

ఇదీ అఖిల భారత సర్వీసు అధికారుల వరస. ముఖ్యమంత్రిని ఖచ్చితంగా గౌరవించాల్సిందే. ఇందులో ఎవరికీ రెండో అభిప్రాయం ఉండదు. ఏదైనా విషయం ఉంటే..మీరు చెప్పినట్లుగానో...లేక సీఎం గారు చెప్పినట్లో అని చెప్పటం ఆనవాయితీ. కానీ కొంత మంది ఐఏఎస్ అధికారులు సీఎం చంద్రబాబు విషయంలో ఎక్కడ లేని విధేయత చూపుతూ పదే పదే ‘తమరు..తమరు’ అంటూ అఖిల భారత సర్వీసు అధికారుల పరువు తీస్తున్నారనే వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. రెండు రోజుల పాటు అమరావతిలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో కొంత మంది కలెక్టర్లు..సీనియర్ ఐఏఎస్ అధికారులు చేసిన ‘చంద్రబాబు భజన’ చూసి మిగిలిన వారంతా అవాక్కు అయ్యారంటే అతిశయోక్తి కాదేమో. ఓ సీనియర్ ఐఏఎస్ అయితే ఇలా రెచ్చిపోయారు. ‘చంద్రబాబు శ్రీరాముడిలాంటోరు. హనుమంతుడు లంకకు వెళ్లినప్పుడు సీతను వెతికి తేగలనా? అన్న భయం పట్టుకుంది. వెంటనే శ్రీరాముడిని తలచుకుంటే శక్తి వచ్చేసింది. లక్ష్యాన్ని పూర్తి చేశారు. అలాగే ఏపీలోని 13 మంది జిల్లాల కలెక్టర్లు ఎన్ని కష్టాలనైనా చంద్రబాబు పేరు తలచుకోగానే శక్తివచ్చి పనులు పూర్తి చేయగలుగుతున్నారు.’ ఇదీ ఆయన వరస.

త్వరలోనే పదవి విరమణ చేయనున్న ఆయన టీడీపీ టిక్కెట్ పై పోటీచేసే ఆలోచనలో ఉన్నట్లు ఐఏఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సాక్ష్యాత్తూ కలెక్టర్ల సమావేశంలో కొంత మంది అధికారుల ‘తమరు’ భజన చూసి మనం ఇంకా బ్రిటీష్ పాలన నాటి కాలంలో ఉన్నట్లు ఉందని ఓ సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు. ఐఏఎస్ ల భజన కార్యక్రమాన్ని చంద్రబాబు కూడా ముసిముసి నవ్వులతో ఎంజాయ్ చేశారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. రియల్ టైమ్ గవర్నన్స్ (ఆర్టీజీఎస్) సంతృప్తిస్థాయి లెక్కలు ఎంత బోగస్ అనేది సాక్ష్యాత్తూ ఏపీ మంత్రి అచ్చెన్నాయుడే బహిర్గతం చేసినట్లు అయింది. గృహనిర్మాణ శాఖ విషయంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని ఐఏఎస్ అధికారి బాబు చెప్పగా...శ్రీకాకుళం జిల్లాలో అసలు ఇళ్ళే ఇవ్వలేదని..అలాంటప్పుడు సంతృప్తి స్థాయి ఎక్కడ నుంచి వస్తది అని ఆయన ప్రశ్నించటంతో అవాక్కు అవటం అందరి వంతు అయింది.

 

Similar News