‘వచ్చే దసరా నుంచి ప్రగతి భవన్ లో సీఎం కెసీఆర్ ప్రజలను కలుస్తారు’ ఇదీ గత ఏడాది జూలైలో సీఎం కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలోని సారాంశం. మళ్లీ దసరా వస్తోంది. అలాంటి ప్రతిపాదన ఏదీ ఉన్నట్లు కన్పించదు. అంతే కాదు..తెలంగాణ ఐటి, మునిసిపల్ శాఖ మంత్రి, సీఎం కెసీఆర్ తనయుడు కెటీఆర్ దీనికి సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు రోజువారీగా ముఖ్యమంత్రి ప్రజలను కలవాల్సిన పనేముందని వ్యాఖ్యానించారు. సోమవారం నగరంలోని ఐఏఎస్ లకు అవార్డులు ప్రదానం చేసే కార్యక్రమంలో మాట్లాడిన ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘గత ముఖ్యమంత్రులు చేసినట్లే..ఈ సీఎం కూడా ప్రజాదర్బార్ నిర్వహించాలని చాలా మంది అంటున్నారు. ఇది తెలివితక్కువ వ్యవహారం. ఓ ముఖ్యమంత్రి రోజువారి ప్రాతిపదికన ప్రజలను కలవాల్సిన అవసరం ఏముంది?. సీఎంకు ఎంతో పెద్ద పరిపాలనా వ్యవస్థ ఉంది. 31 జిల్లాలు ఉన్నాయి. ఆ జిల్లాల్లో కలెక్టర్లు ఉన్నారు. 564పైగా మండలాలు..మండల స్థాయి అధికారులు ఉన్నారు. గ్రామస్థాయి పరిపాలన కూడా ఉంది. 29 మంది గ్రామ స్థాయి నిర్వాహకులు ఉన్నారు. వీరికి ప్రభుత్వం వేతనాలు చెల్లిస్తుంది..వారి బాధ్యతలు నిర్వహించటానకి..ప్రజల అవసరాలు తీర్చటానికి.
ఇంత పెద్ద వ్యవస్థను పెట్టుకుని...లక్షలాది మంది ఉద్యోగులను పెట్టుకుని, వందల సంఖ్యలో ఎమ్మెల్యేలు, వేల సంఖ్యలో ఉన్నతాధికారులు ఉన్న వ్యవస్థలో ముఖ్యమంత్రి ప్రజలను కలవాల్సిన అవసరం ఏముంది?. సీఎం చాలా పెద్ద విషయాలపై దృష్టి సారించాల్సి ఉంటుంది. అంతే కానీ ప్రజాదర్భార్ లు నిర్వహించటం కాదు. ప్రజాదర్భార్ లు నిర్వహించటానికి ఆయన మోనార్క్ కాదని..ఇది ప్రజాస్వామ్యం అని వ్యాఖ్యానించారు. ప్రజలు జిల్లాల నుంచి అన్నింటికి ముఖ్యమంత్రి దగ్గరకి వస్తే అది విఫల ప్రభుత్వంగా నిలుస్తుందనేది తన అభిప్రాయం అని కెటీఆర్ వ్యాఖ్యానించారు. పెన్షన్ల మంజూరు...గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో తీసుకోవాల్సిన అంశాలు ముఖ్యమంత్రి దగ్గరికి వస్తే అది పెద్ద ఫెయిల్యూర్ గా భావించాల్సి ఉంటుంది అన్నారు. ప్రజల పనులు సహజంగా అలా అయిపోవాలి. అధికారిని తన పని కోసం అడిగి..అక్కడ కూడా కాకపోతే మంత్రి దగ్గరకు పోయి..తర్వాత ఎమ్మెల్యే దగ్గరకు పోవాల్సిన అవసరం ఏముంది? నిజంగా ఇది ఫన్నీ. మినిమం గవర్నమెంట్..మాగ్జిమమ్ గవర్నెన్స్ తమ విధానం అని పేర్కొన్నారు. విచిత్రం ఏమిటంటే సీఎం కెసీఆర్ ప్రజలనే కాదు...మంత్రులు..ఎమ్మెల్యేలను కూడా కలవటంలేదనే విమర్శలు నిత్యం విన్పిస్తున్నవే. అంతేకాదు.. దేశంలోనే సచివాలయానికి రాకుండా పరిపాలన సాగిస్తున్న సీఎంగా కెసీఆర్ ‘కొత్త చరిత్ర’ సృష్టిస్తున్నారు.