అవిశ్వాసం ఔట్....ఉభయ సభలు నిరవదిక వాయిదా

Update: 2018-04-06 06:44 GMT

ఇప్పుడు ఎవరి నోట చూసినా ఒకటే మాట. బిజెపి కంటే కాంగ్రెస్ పార్టీనే నయం. పార్లమెంట్ లో వరస పెట్టి ప్రతిష్టంభనలు చోటుచేసుకుంటున్నా కనీసం ఒక్కటంటే ఒక్క రోజు కూడా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కానీ...ప్రభుత్వం కానీ పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నాలు చేసిన దాఖలాలు లేవు. మీరు గొడవ చేస్తారా?. మేం వాయిదా వేస్తాం అన్న చందంగానే రెండవ విడత బడ్జెట్ సమావేశాలు ముగిసిపోయాయి. అసలు సమస్యల పరిష్కారం కోసం..సభను సజావుగా నడిపేందుకు వీలుగా ఒక్కటంటే ఒక్క సమావేశం కూడా బిజెపి ఏర్పాటు చేయలేకపోయింది. కానీ సభలో మాత్రం అన్ని అంశాలపై చర్చకు తాము సిద్ధం అంటూ పదే పదే ప్రకటించింది కానీ..సభ వెలుపల మాత్రం ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. ఇది ఖచ్చితంగా మోడీ సర్కారుకు ప్రతి కూల అంశమే. ప్రజలు మాత్రం ఎన్డీయే సర్కారు తీరును ఏ మాత్రం హర్షించరు. ఈ ప్రభుత్వంపై తమకు విశ్వాసం లేదంటూ కాంగ్రెస్ తోపాటు ప్రత్యేక హోదాతోపాటు పలు డిమాండ్ల కోసం టీడీపీ, వైసీపీలు వరసగా అవిశ్వాస తీర్మానాలు ఇచ్చినా సభ ఆర్డర్ లో లేదంటూ స్పీకర్ వీటిని ఆమోదించకపోవటం ఏ మాత్రం సరికాదని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. బడ్జెట్‌ సమావేశాల చివరి రోజైన శుక్రవారం లోక్‌ సభ ప్రారంభమైన వెంటనే.. సమావేశాల ముగింపునకు సబంధించి స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ కీలక ప్రకటన చేశారు.

వెల్‌లో ఆందోళన చేస్తోన్న అన్నాడీఎంకే ఎంపీలు వెనక్కి వెళితే.. అవిశ్వాస తీర్మానం నోటీసులపై మాట్లాడతానన్న స్పీకర్‌.. సభను నిరవదికంగా వాయిదావేశారు. రెండు విడదలుగా పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు జరిగిన తీరు తెన్నులను స్పీకర్‌ వివరిస్తున్న తరుణంలో.. అవిశ్వాసంపై చర్చ చేపట్టాలని విపక్ష ఎంపీలు గట్టిగా నినాదాలు చేశారు. అయినాసరే, స్పీకర్‌ తన ప్రసంగాన్ని కొనసాగించారు. అరుపుల మధ్యే జాతీయ గేయం వందేమాతరం ప్రారంభంకావడంతో ఎంపీలు మిన్నకుండిపోయారు. ఆ తర్వాత లోక్‌సభను నిరవదికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఆఖరి రోజు లోక్‌ సభకు ప్రధాని మోదీ, ఇతర ముఖ్య నేతలంతా హాజరయ్యారు.

 

Similar News