లోకేష్...ఈ లెక్కేంటి మరి!

Update: 2018-04-06 04:31 GMT

5.5 ఎకరాల్లో 8000 ఐటి ఉద్యోగాలు...40 ఎకరాల్లో 2500 ఉద్యోగాలా?

అది ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం అమరావతి. అక్కడ 5.5 ఎకరాల్లో 45 ఐటి కంపెనీలు. కల్పించే ఉద్యోగాలు 8000. ఇదీ ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఏపీసీఆర్ డీఏ) తీసుకున్న నిర్ణయం. ఈ సీఆర్ డీఏ ఛైర్మన్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్న సంగతి తెలిసిందే. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా అమరావతిలో 5.5 ఎకరాల్లో పది లక్షల చదరపు అడుగుల్లో ఐటి టవర్ నిర్మించనున్నారు. దీనికి అయ్యే వ్యయం కూడా సుమారు 290 కోట్ల రూపాయలు. మరి విశాఖపట్నంలో మాత్రం 400 కోట్ల రూపాయల విలువైన 40 ఎకరాల భూములు అప్పనంగా అప్పనంగా అప్పగిస్తే ఆ సంస్థలు కల్పించే ఉద్యోగాలు కేవలం 2500. అదీ ఎనిమిదేళ్ళలో. ఎంత హై ఎండ్ ఉద్యోగాలు అయినా అమరావతిలో ఐటి కంపెనీల ఉద్యోగాల లెక్కకు...విశాఖపట్నంలో ఐటి ఉద్యోగాల లెక్కకు అసలు ఏమైనా పోలిక ఉందా?. జస్టిఫికేషన్ ఉందా?. ఉమ్మడి రాష్ట్రం నుంచే హైదరాబాద్ తర్వాత ఏపీలో ఐటి రంగం అభివృద్ధి చెందిన ప్రాంతం ఏదైనా ఉంది అంటే అది విశాఖపట్నమే.

రుషికొండ ప్రాంతానికి చాలా డిమాండ్ కూడా ఉంది. 5.5 ఎకరాల్లో 10 లక్షల చదరపు అడుగుల్లో ఓ 45 ఐటి కంపెనీలకు చోటు కల్పించినప్పుడు ఎంత పెద్ద కంపెనీలు అయినా కేవలం రెండు సంస్థలకు 400 కోట్ల రూపాయల విలువైన 40 ఎకరాలు అప్పగించాల్సిన అవసరం ఏముంది. సీఎస్ దినేష్ కుమార్ ప్రతిపాదించినట్లు పది ఎకరాల్లో వర్టికల్ గా భవనాలు కట్టుకుంటే ఎంత మందికి అయినా చోటు కల్పించవచ్చు. కానీ అలా చేయకుండా కేవలం ఏవో ప్రయోజనాలు ఆశించే అత్యంత విలువైన భూమిని రెండు సంస్థలకు కట్టబెట్టారని చెబుతున్నారు. పైగా విశాఖపట్నం భవిష్యత్ లో మరింత ప్రగతి సాధించే నగరాల్లో ముందు వరసలో ఉంటుందని....ఇలాంటి చోట భూమిని చాలా జాగ్రత్తగా వాడుకోవాల్సి ఉండగా..ప్రభుత్వం మాత్రం ఇష్టానుసారం కేటాయింపులు చేస్తుందనే విమర్శలు ఎదుర్కొంటోంది.

 

 

Similar News