పవన్ పై జగన్ సంచలన వ్యాఖ్యలు

Update: 2018-04-06 16:39 GMT

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ సినిమా అయినా రెండున్నర గంటలు..ఇంటర్వెల్ పది నిమిషాలు ఉంటుంది. కానీ పవన్ సినిమా పది నిమిషాలు ...ఇంటర్వెల్ రెండున్నర గంటలు ఉంటుందని వ్యాఖ్యానించారు. ఆయన ట్విట్టర్ లో కామెంట్లు చేయటం...ఖాళీ ఉన్నప్పుడు వచ్చి రాజకీయాలు చేయటం తప్ప..ఆయన చేసింది ఏముందని ప్రశ్నించారు. గత నాలుగేళ్లుగా రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా పవన్‌ కల్యాణ్‌ ఏం చేశారని జగన్‌మోహన్‌ రెడ్డి ప్రశ్నించారు. వైఎస్సార్‌ సీపీ ప్రత్యేక హోదా కోసం నాలుగేళ్లుగా పోరాడుతున్నా, చంద్రబాబు నాయుడు బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్‌ జగన్‌ ధ్వజమెత్తారు. తాము హోదాతో వచ్చే ప్రయోజనాలను ప్రజలందరికీ వివరించి చైతన్య పరుస్తుంటే.. జనసేన అధినేత నాలుగేళ్లుగా ఏం చేశారని జగన్ పశ్నించారు. నాలుగేళ్లపాటు యువభేరీలు, సదస్సులు, దీక్షలు చేపట్టి హోదా ప్రాముఖ్యతను ప్రజలందరికీ తెలియచేశామని వైఎస్‌ జగన్‌ అన్నారు.

పవన్‌ కల్యాణ్‌ ప్రత్యేక హోదా కోసం ఏ కార్యక్రమాలు చేపట్టారని ప్రశ్నించారు. 2014లో చంద్రబాబు, బీజేపీతో జతకట్టిన పవన్‌, వారికి ఓటు వేయమని అడగలేదా అన్నారు. నాలుగేళ్ల తర్వాత ఉనికి కోసం బీజేపీ, చంద్రబాబు రాష్ట్రాన్ని ముంచారని అంటున్నారని, అదే మేధావి పవన్‌ తీరు అని మండిపడ్డారు. ప్రత్యేక హోదా బదులు, ప్రత్యేక ప్యాకేజీ ఇస్తున్నామని జైట్లీ ప్రకటన చేసినప్పుడు పవన్‌ కల్యాణ్‌ ఏమయ్యారని, ఆ రోజే చంద్రబాబును ఎందుకు నిలదీయలేదని వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు. ఇన్నాళ్లు పార్టనర్‌ చంద్రబాబుకు సపోర్టు చేసిన పవన్‌ ఇప్పుడు ఏవిధంగా ప్రత్యేక హోదాపై మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. ప్రత్యేక హోదాపై తమ వైఖరి నాలుగేళ్లుగా ఏనాడు మారలేదని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. రాజీనామాలే తమ ఆఖరి అస్త్రమని చెప్పామని.. చెప్పినట్లుగానే పార్లమెంట్‌ సభ్యులతో రాజీనామాలు చేయించామని స్పష్టం చేశారు. ఎంపీలు రాజీనామా చేస్తే తనపై కేసులు వస్తే ఎవరు పోరాడతారనే భయం చంద్రబాబుకు పట్టుకుందని, అందుకే రాజీనామాలు చేయడం లేదని ప్రతిపక్ష నేత విమర్శించారు. విలేకరుల సమావేశంలో జగన్ చంద్రబాబునుద్దేశించి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఏదైనా బావిలో దూకితే రాష్ట్రానికి పట్టిన శనిపోతుందని అన్నారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జగన్ ప్రతిపక్ష నేతగా కంటే ప్రతినాయకుడిగా వ్యవహరిస్తున్నారని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు.

 

Similar News