చంద్రబాబుకు ‘జగన్ మాస్టర్ స్ట్రోక్’

Update: 2018-04-30 07:30 GMT

తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి సోమవారం ఉదయమే మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారు. ఈ స్ట్రోక్ తో తెలుగుదేశం పార్టీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నిజంగా ఇది అధికార తెలుగుదేశం పార్టీకి షాక్ లాంటి పరిణామంగానే చెప్పుకోవచ్చు. తాము అధికారంలోకి వస్తే కృష్ణా జిల్లాను నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్ ) జిల్లాగా మారుస్తామని జగన్ పాదయాత్రలో ప్రకటించటంతో తెలుగుదేశం పార్టీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పాదయాత్రలో భాగంగా నిమ్మకూరులోకి ప్రవేశించిన సందర్భంగా జగన్ ఈ ప్రకటన చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పేరును కడప జిల్లాకు పెట్టారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు దాటిన తర్వాత కూడా ఇఫ్పటివరకూ కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలనే ప్రతిపాదనను పరిశీలించలేదు. గతంలో కొంత మంది నేతలు కూడా ఈ డిమాండ్ ను లేవనెత్తారు. కానీ చంద్రబాబు మాత్రం దీన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు జగన్ ఎవరూ ఊహించని రీతిలో కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతామని ప్రకటించటం రాజకీయంగా కలకలం రేపుతోంది.

జగన్ ప్రకటించిన వెంటనే కృష్ణా జిల్లాకు చెందిన మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ప్రభుత్వ పరిశీలనలో ఈ వ్యవహారం ఉందని వ్యాఖ్యానించటం విశేషం. ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు కూడా జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్టీఆర్ పేరెత్తే అర్హత కూడా జగన్ కు లేదని ధ్వజమెత్తారు. ఏది ఏమైనా జగన్ తన పాదయాత్రలో చేసిన ఈ ప్రకటన తెలుగుదేశం పార్టీని ఉక్కిరిబిక్కిరి చేయనుంది. ఇప్పుడు చంద్రబాబు కృష్ణా జిల్లా పేరును ఎన్టీఆర్ జిల్లాగా మార్చినా...చంద్రబాబుకు ఆ క్రెడిట్ మొత్తం రాదనేది ఎవరూ కాదనలేని వాస్తవం. అయితే జగన్ చెప్పిన తర్వాత చంద్రబాబు ఈ పనిచేస్తే నవ్వులపాలు అవటం ఖాయం. చంద్రబాబుకు ఎన్నికల అప్పుడే ఎన్టీఆర్ గుర్తొస్తారు తప్ప...మిగిలిన సమయంలో కన్వీనెంట్ గా మార్చిపోతారు.జగన్ ఏ వ్యూహంతో ఈ ప్రకటన చేసినా ఇది ఖచ్చితంగా పార్టీని ఇరకాటంలోకి నెడుతుందని టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

 

 

Similar News