తెలంగాణ జన సమితి ఆవిర్భావ సభకు కోర్టు గ్రీన్ సిగ్నల్

Update: 2018-04-16 14:15 GMT

తెలంగాణ జన సమితి (టీజెఎస్) ఆవిర్భావ సభకు లైన్ క్లియర్ అయింది. తొలుత పోలీసులు పార్టీ సభకు అనుమతి నిరాకరించారు. దీంతో టీజెఎస్ హైకోర్టును ఆశ్రయించింది. కోదండరాం కొత్తగా ఏర్పాటు చేసిన పార్టీనే టీజెఎస్. భారీ ఎత్తున ఈ సభ నిర్వహించేందుకు కోదండరాం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ సభలోనే కొత్త పార్టీ విధివిధానాలు ప్రకటించనున్నారు. ఈ నెల 29న ఆవిర్భావ సభ జరగనుంది. టీజెఎస్ సభకు 3 రోజుల్లో అనుమతి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. టీజేఎస్‌ పార్టీ ఆవిర్భావ సభకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఆ పార్టీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు.

గతవారం విచారణ చేపట్టిన న్యాయస్ధానం వివరణ ఇవ్వాలని ప్రభుత్వం/పోలీసులను ఆదేశించింది. సోమవారం మరోసారి విచారణ చేపట్టిన హైకోర్టు టీజేఎస్‌ సభకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు తీర్పుపై తెలంగాణ జన సమితి పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. సభ జరిగితే ప్రజలకు నిజాలు తెలుస్తాయనే భయంతోనే సర్కారు తమ సభను అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని కోదండరాం గతంలో విమర్శించారు. అయితే కోర్టు జోక్యంతో టీజెఎస్ ఆవిర్భావ సభకు అనుమతి దక్కింది. ఇప్పుడు అందరి దృష్టి ఈ సభపైనే ఉంది.

 

Similar News