‘అమరావతి’పై పుస్తకాల ఫైటింగ్

Update: 2018-04-05 14:29 GMT

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిపై విజయవాడ సాక్షిగా ‘పుస్తకాల ఫైటింగ్’ మొదలైంది. కొద్ది రోజుల క్రితమే ఏపీ మాజీ సీఎస్ ఐ వై ఆర్ కృష్ణారావు తాను రాసిన ‘ఎవరి రాజధాని అమరావతి’ పుస్తకాన్ని ని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఆవిష్కరించనున్నట్లు ప్రకటించారు. ఈ పుస్తకాన్ని ఆయన మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావుకు అంకితం ఇచ్చారు. గురువారం నాడు విజయవాడలో జరిగిన ఈ పుస్తకావిష్కరణ సభలో పవన్ కళ్యాణ్ తోపాటు వడ్డే, ఉండవల్లి అరుణకుమార్, సీపీఎం, సీపీఐ నేతలు పాల్గొన్నారు. పుస్తకావిష్కరణ సందర్భంగా ఉండవల్లి మాట్లాడుతూ రాజధానికి రైతులు 33 వేల ఎకరాలు ఇచ్చి త్యాగం చేశారని సీఎం చంద్రబాబు ప్రకటించారని..ఇది చూసి అంటే వాళ్లకు చంద్రబాబు ఏమీ చేయరా అనే అనుమానం తలెత్తిందని అన్నారు. అమరావతిని మయన్మార్ రాజధానిలా ఘోస్ట్ సిటీగా చేయవద్దని వ్యాఖ్యానించారు. ఒకేసారి వేల ఎకరాల్లో చకచకా అద్భుతమైన భవనాలు కట్టినా అక్కడ మనుషులు ఉండాలి కదా? అని ప్రశ్నించారు.

ఏ నగరం అయినా క్రమంగా అభివృద్ధి చెందాలే కానీ..ఇలా వేల ఎకరాల్లో సారవంతమైన భూముల్లోకాదన్నారు. ఐవైఆర్ పుస్తకంతో ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయని వ్యాఖ్యానించారు. అయితే ఐవైఆర్ పుస్తకానికి కౌంటర్ గా తెలుగుదేశం పార్టీ ఓ పుస్తకాన్ని సిద్ధం చేసింది. ‘ప్రజా రాజధానిపై కుట్ర..అడ్డుకుంటున్న దుష్ట చతుష్టయం’ అనే పుస్తకాన్ని టీడీపీ నేత వర్ల రామయ్య విడుదల చేశారు. దీనిపై ప్రధాని మోడీతోపాటు జగన్, పవన్ కళ్యాణ్, ఐవైఆర్ ల ఫోటోలు ముద్రించారు. శ్రీధర్ వర్మ ఈ పుస్తకాన్ని సిద్ధం చేశారు. ఈ పుస్తకావిష్కరణ అనంతరం వర్ల రామయ్య మాజీ సీఎస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఎవరిని వంచించాలని ఎవరి పక్కన చేరావు అంటూ ప్రశ్నించారు. రైతుల్లో అయోమయం కల్పించేందుకే ఇలాంటి పనులు చేస్తున్నారని..రైతులు కోరుకుంటున్నట్లు అద్బుతమైన రాజదాని అమరావతిలో వస్తుందని ఆయన తెలిపారు. అమరావతిపై రెండు పుస్తకాల ఆవిష్కరణ సమావేశాలు ఉండటంతో పోలీసులు కూడా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.

 

Similar News