ఏపీ బంద్ అందరికీ ఓ సందేశం’ పంపింది

Update: 2018-04-16 13:16 GMT

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బంద్ లు వద్దు. మనల్ని మనం శిక్షించుకుంటామా?. జపాన్ తరహా నిరసన..ఎక్కువ పని చేసి నిరసన అంటూ రకరకాల నినాదాలు ఇచ్చినా ప్రజలు ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఎక్కువ గంటల పని అంటే ఎవరు చేయగలరు?. ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే ఆ పని చేస్తారు?. ఉద్యోగాలు లేకుండా ఖాళీగా ఉన్న యువత ఏమి చేస్తారు. చంద్రబాబు అన్నింటిలోనూ విదేశీ మోజు చూపించినట్లే...చివరకు బంద్ లు..నిరసనలకు కూడా విదేశీ మోడల్స్ ను ఫాలో అవుతున్నారు. అయితే ‘ప్రత్యేక హోదా’ విషయంలో ప్రజల వైఖరి ఎలా ఉందో సోమవారం నాడు జరిగిన ఏపీ బంద్ రాజకీయ నేతలు అందరికీ స్పష్టమైన సంకేతాలు పంపింది. ఇప్పుడు ఏపీలో ప్రత్యేక హోదా ఓ సెంటిమెంట్ ఇష్యూగా మారిపోయింది. ఈ సారి ఏపీ బంద్ నకు పిలుపునిచ్చింది ప్రత్యేక హోదా సాధన సమితి కావటం..దానికి ప్రధాన ప్రతిపక్షం అయిన వైసీపీ, జనసేన, కాంగ్రెస్, వామపక్షాలు అందరూ మద్దతు ఇచ్చారు. అందుకే చంద్రబాబు కూడా ఈ బంద్ ను విపలం చేసే ప్రయత్నం చేయలేదు. ఏదైనా రాజకీయ పార్టీ బంద్ నకు పిలుపు ఇచ్చి ఉంటే..మాత్రం చంద్రబాబు తన సహజశైలిని చూపేవారే. కానీ ఇప్పుడు పరిస్థితి మారటంతో ఆయనకు ఇష్టం లేకుండా మౌనంగా బంద్ కు సహకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఏపీలో సోమవారం నాడు జరిగిన బంద్ ఎలాంటి ఆందోళనలు లేకుండా సాఫీగా..పూర్తి విజయవంతం అయింది. ఈ బంద్ విజయంతో ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్‌ చలసాని శ్రీనివాస్‌ దూకుడు పెంచారు. ఐదు కోట్ల ఆంధ్రుల హక్కు అయిన ప్రత్యేక హోదా కోసం పోరాడకుండా ఉన్న ద్రోహులు ఇకనైనా కళ్లు తెరవాలని ఆయన హితవు పలికారు. రాష్ట్రానికి హోదా సాధనకై తమ పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పిన ఆయన, ఈ నెల 24న బ్లాక్‌డే నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆ రోజు రాత్రి 7 గంటల నుంచి 7.30 గంటల వరకూ విద్యుత్‌ దీపాలు ఆపేసి చీకటి దినంగా పాటించాలని ప్రజలను కోరారు. తదుపరి కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల ముందు నిరసన కార్యక్రమాలు చేపడతామని, 24 గంటలపాటు జాతీయ రహదారులను దిగ్బంధిస్తామని చలసాని తెలియచేశారు.

 

Similar News