టీడీపీ రాజ్యసభ అభ్యర్ధులు సీఎం రమేష్..రవీంద్రకుమార్

Update: 2018-03-11 10:47 GMT

తెలుగుదేశం రాజ్యసభ అభ్యర్ధుల పేర్లు టీడీపీ అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సీఎం రమేష్ ను కొనసాగిస్తూ..కొత్తగా లీగల్ సెల్ అధ్యక్షుడిగా ఉన్న కనకమేడల రవీంద్రకుమార్ కు అవకాశం కల్పించారు. దీంతో రెండురోజులుగా సాగుతున్న కసరత్తుకు తెరపడింది. తొలి నుంచి సీఎం రమేష్ తోపాటు..వర్ల రామయ్య పేరు ప్రముఖంగా విన్పించినా చివరి నిమిషంలో మాత్రం మార్పు చోటుచేసుకుని..కనకమేడల రవీంద్రకుమార్ ఎంటర్ అయ్యారు. అయితే ప్రచారం జరిగినట్లు మూడవ అభ్యర్థి జోలికి వెళ్ళకుండా..సభ్యుల సంఖ్య ప్రకారం తమకు వచ్చే మేరకే ఇద్దరితో సరిపెట్టాలని టీడీపీ నిర్ణయించింది.

దీంతో రెండు సీట్లు టీడీపీకి, ఒక సీటు ప్రధాన ప్రతిపక్షం వైసీపీకి దక్కనుంది. ఏపీలో ఎన్నికలు జరిగే ఛాన్స్ కూడా లేదు. ఏకగ్రీవంగానే ఏపీలో రాజ్యసభ ఎన్నికలు పూర్తి కానున్నాయి. నామినేషన్ల గడువు సోమవారంతో ముగియనుంది. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబుతో తన నివాసంలో మంత్రులు కళా వెంకట్రావు, యనమల రామకృష్ణుడుతో పలుదఫాలు చర్చలు జరిపారు. టీడీపీ లీగల్‌ సెల్‌ అధ్యక్షుడిగా ఉన్న ఆయనను పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించడంతో.. ఈ పదవిని ఆశించిన సీనియర్‌ నేత వర్ల రామయ్య తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. అయితే తనకు అసంతృప్తి ఉన్నా పార్టీ అధ్యక్షుడి నిర్ణయాన్ని గౌరవిస్తానని వర్ల రామయ్య చెబుతున్నారు.

Similar News