తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఊరట

Update: 2018-03-20 04:00 GMT

తెలంగాణ సర్కారు స్పీడ్ కు హైకోర్టు బ్రేక్ వేసింది. చరిత్రలో ఎన్నడూలేని రీతిలో తెలంగాణ శాసనసభ నుంచి ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు చేసి..వెంటనే ఈ రెండు సీట్లు ఖాళీ అని నోటిఫై చేసింది. అదే సమయంలో ఎన్నికల కమిషన్ కు కూడా ఆగమేఘాల మీద సమాచారం పంపారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ లు హైకోర్టును ఆశ్రయించగా..వారికి అక్కడ రిలీఫ్ దొరిగింది. ఆరు వారాల పాటు ఎన్నికల ప్రక్రియ ప్రారంభించవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో సర్కారు ప్లాన్ కు బ్రేకులు పడినట్లు అయింది. అసెంబ్లీలో ఈ నెల 12న గవర్నర్‌ ప్రసంగానికి సంబంధించిన మొత్తం ఒరిజినల్‌ వీడియో ఫుటేజీని 22న సీల్డ్‌ కవర్‌లో అందజేయాలని అసెంబ్లీ కార్యదర్శిని కోర్టు ఆదేశించింది.

మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని అసెంబ్లీ కార్యదర్శి, న్యాయ, శాసన వ్యవహారాల కార్యదర్శి, కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శులకు స్పష్టం చేస్తూ... విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ బి.శివశంకరరావు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ‘‘ఇయర్‌ ఫోన్‌ విసిరి మండలి చైర్మన్‌ను గాయపరిచారన్న కారణంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌లను బహిష్కరించలేదు. గవర్నర్‌ ప్రసంగం సందర్భంగా అనుచితంగా.. సభ ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరించినందునే తీర్మానం ప్రవేశపెట్టి వారిని బహిష్కరించారు. ఇది సభ నిర్ణయమే తప్ప.. స్పీకర్‌ది కాదు. సభ నిర్ణయం మేరకు స్పీకర్‌ వ్యవహరించారు. సభ లోపల, వెలుపల ఎక్కడ సభ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించినా సభ్యులపై చర్యలు తీసుకునే అధికారం స్పీకర్‌కు ఉంది.

ఆ అధికారం మేరకే స్పీకర్‌ చర్యలు తీసుకున్నారు. గవర్నర్‌ రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తి. ఆయన ప్రసంగిస్తున్నప్పుడు ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించడం సరికాదు. పిటిషనర్లు ఎక్కడా సభ కార్యకలాపాలకు విఘాతం కలిగించేలా వ్యవహరించలేదని చెప్పలేదు. ఇయర్‌ ఫోన్‌ విసిరిన దానికి ఎటువంటి పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదు..’’అని కోర్టుకు విన్నవించారు. సభలో సభ్యుల ప్రవర్తన ఆధారంగా చర్యలు తీసుకునే అధికారం స్పీకర్‌కు ఉందని సుప్రీంకోర్టు కూడా పలు తీర్పుల్లో స్పష్టం చేసిందని వివరించారు.

 

Similar News