వైసీపీ..జనసేన బిజెపి కోవర్టులు

Update: 2018-03-20 05:24 GMT

తెలుగుదేశం అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జనసేనపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వైసీపీపై మొదటి నుంచే అదే తీరు. కాకపోతే ఇప్పుడు ఆ జాబితాలో కొత్తగా జనసేన కూడా చేరింది. మంగళవారం నాడు ఎంపీలతో టెలికాన్ఫరెన్స్ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. బిజెపి,వైసీపి,జనసేన మూడు పార్టీల అజెండా ఒక్కటే. టిడిపిపై బురదజల్లడమే సింగిల్ పాయింట్ అజెండాగా పెట్టుకున్నాయి. వైసిపి,జనసేన పార్టీలు బిజెపికి కోవర్టులుగా పనిచేస్తున్నాయి. టిడిపిని బద్నాం చేయాలని చూస్తున్నాయి.దానివల్ల ఎవరికి లాభం..?మేము అడిగేది చేయకుండా ఇలా మాపై బురదజల్లడం ఏమిటని ప్రజలే ప్రశ్నిస్తున్నారు.రాష్ట్రానికి అన్యాయం చేయడం, సమస్యను పక్కదారి పట్టించడం,టిడిపిపై బురద జల్లడం ఒక పద్దతి ప్రకారం మూడు పార్టీలు చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారు.గతంలో సాక్షిలో వచ్చిన ఆరోపణలే చేస్తున్నారు. ప్రజల్లో గందరగోళం సృష్టించడానికే ఈ నాటకాలు ఆడుతున్నారు. పోలవరం పునరావాసం ఇస్తామని కేంద్రం చెప్పినట్లు,కానీ రాష్ట్ర ప్రభుత్వమే చేస్తామని ముందుకొచ్చినట్లు పవన్ కళ్యాణ్ అనడం పచ్చి అబద్దం. పవన్ నిన్న లోకేశ్ కు,శేఖర్ రెడ్డికి ముడిపెట్టారు. ఈ రోజు పోలవరంపై ఆరోపణలు చేస్తున్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ఈ కీలక సమయంలో పవన్ ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు...?ఎవరు చేయిస్తున్నారు...?బహోదా గురించి మోడి చెప్పలేదు.యూపీఏ చెప్పిందని పవన్ అనడం వెనుక అర్ధం ఏమిటి..? ఎవరికి మీరు కొమ్ము కాస్తున్నారు..?

ఎవరి లాభాల కోసం పనిచేస్తున్నారు..? నాకు మోడికి విరోధం ఏముంది..?విరోధం ఉందని మోడి చెప్పారా నీతో..? ఎవరు చెప్పారు..? ఏ ఒక్కరూ నాపై సంతృప్తిగా లేరట..అందరూ మోడిపట్ల సంతృప్తిగా ఉన్నారట, జగన్ అంటున్నారు. మూడు పార్టీల(బిజెపి,వైసీపి,జనసేన)స్క్రిప్ట్ ఒక్కటే. ఒకేచోట ఆ స్క్రిప్ట్ లు తయారు అవుతున్నాయి.ఆ ఆరోపణలన్నీ సాక్షిలో వచ్చినవే. ప్రజలు తిరస్కరించినవే. నేనేం తప్పు చేశాను.ప్రజల హక్కులు కాపాడాలని అడిగాను.రాష్ట్రానికి న్యాయం చేయమన్నాను.అది తప్పా..?అదే నేరమా..? ఎవరెన్ని ఆరోపణలు చేసినా ప్రజలు నన్ను అర్ధం చేసుకున్నారు. ఈ మూడుపార్టీలు నన్ను ఎంత తిడితే టిడిపికి అంత లాభం.ఎంత తిడితే అంత కక్ష ప్రజల్లో పెరుగుతుంది.అంత మద్ధతు పెరుగుతుంది ప్రజల్లో. వైసీపి,జనసేన నామీద విమర్శలే తప్ప మోడిపై ఈగ వాలనివ్వడంలేదు. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న కేంద్రాన్ని ఒక్కమాట అనడంలేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎన్డీఏలో కలిశాం.రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎన్డీఏ నుంచి వైదొలిగాం.గతంలో నేషనల్ ఫ్రంట్ లో,యునైటెడ్ ఫ్రంట్ లో ఉన్నా రాష్ట్ర ప్రయోజనాల కోసమే..జాతీయ రాజకీయాల్లో తెలుగుదేశం పాత్ర రాష్ట్ర ప్రయోజనాల కోసమే.’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

 

 

Similar News