ఏపీ సీఎంవో అధికారులపై ఎంపీ సంచలన ఆరోపణలు

Update: 2018-02-22 12:56 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయంలో సీనియర్ అధికారులుగా ఉన్న ఐఏఎస్ లపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. పక్కా ఆధారాలతోనే తాను మాట్లాడుతున్నానని..వీటిని ఎదుర్కోవటానికి వారు సిద్ధంగా ఉంటే...తన దగ్గర ఉన్న ఆధారాలు బయటపెట్టడానికి తాను రెడీ అని ప్రకటించారు. గతంలో సీఎం ముఖ్య కార్యదర్శి సతీష్ చంద్ర ఒక్కరిపైనే ఆరోపణలు చేసిన విజయసాయిరెడ్డి ఈ సారి సీఎంవోలోని ఇతర ఐఏఎఎస్ అధికారులైన సాయి ప్రసాద్, రాజమౌళితోపాటు ఐజీ వెంకటేశ్వరరావు పేర్లు ప్రస్తావించారు. విజయసాయిరెడ్డి ఆరోపణలపై ఏపీ ఐఏఎస్ ల సంఘం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయినా సరే విజయసాయిరెడ్డి మరోసారి తన ఆరోపణలు కొనసాగించారు. బిజినెస్ రూల్స్ ప్రకారం నడుచుకోవాల్సిన సతీష్ చంద్ర అడ్డగోలుగా నిబంధనలు ఉల్లంఘించి అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.

తన దగ్గర ఆధారాల సంగతి పక్కన పెడితే సాక్ష్యాత్తూ చంద్రబాబు కేబినెట్ లోని మంత్రి ఆదినారాయణరెడ్డే ఇద్దరు ఐఏఎస్ లను పక్కన పెట్టుకుని చంద్రబాబునాయుడు తనకూ, రామసుబ్బారెడ్డికి మధ్య సెటిల్ చేశారని చెప్పారని..ఇంత కంటే నిదర్శనం ఏమి కావాలని ప్రశ్నించారు. ఆ ఇద్దరు ఐఏఎస్ అధికారుల్లో ఒకరు సతీష్ చంద్ర అని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. సివిల్ సర్వీస్ అధికారులైన వీరు నిబంధనలు ఉల్లంఘించి పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వారిపై చర్యలు లేకుండా పలు కార్యాలయాలపై ఒత్తిడి తెస్తున్నారని తెలిపారు. గతంలో తాను సతీష్ చంద్రతోపాటు మిగిలిన అధికారులపై చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. సతీష్ చంద్ర తీరు మొదటి నుంచి వివాదస్పదంగానే ఉందని కొంత మంది అధికారులు కూడా వ్యాఖ్యానిస్తున్నారు.

 

Similar News