టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు మృతి

Update: 2018-02-07 03:00 GMT

తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి..ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు మంగళవారం అర్థరాత్రి తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 70 సంవత్సరాలు. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని కేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. మూడు నెలల కిందటే గుండెకు శస్త్రచికిత్స చేయించుకున్న ముద్దుకృష్ణమ.. డెంగ్యూతో బాధపడుతూ రెండు రోజులముందు ఆస్పత్రిలో చేరారు. మృద్దుకృష్ణమ మరణంతో ఆయన కుటుంబంలో తీవ్రవిషాదం నెలకొంది. జ్వరంతో బాధపడిన ముద్దుకృష్ణమను కుటుంబీకులు తిరుపతి నుంచి హైదరాబాద్‌కు తరలించారు.

‘‘డెంగ్యూ జ్వరం, బీపీ కంట్రోల్‌ లేని స్థితిలో ఆదివారం ఆయన ఆస్పత్రిలో చేరారు. రెండురోజుల్లోనే మల్టీఆర్గాన్‌ ఫెయిల్యూర్‌ వల్ల పరిస్థితి చేయిదాటిపోయింది’’ వైద్యులు తెలిపారు. అయితే ముద్దుకృష్ణమ నాయుడి అంత్యక్రియలను ఆయన స్వగ్రామం చిత్తూరు జిల్లాలోని వెంకట్రామాపురంలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గాలి ముద్దుకృష్ణమనాయుడు 1947, జూన్‌9న జన్మించారు. ఆయన స్వస్థలం చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలంలోని వెంకట్రామాపురం. విద్యాభ్యాసం తర్వాత అధ్యాపక వృత్తిలోకి ప్రవేశించిన ఆయన.. 1983లో ఎన్టీఆర్‌ పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చారు. తెలుగుదేశం పార్టీ తరఫున ఆరు సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

 

 

Similar News