అధికార టీడీపీని వదిలేసి..ప్రతిపక్షానికి పవన్ సవాళ్ళు

Update: 2018-02-19 15:00 GMT

పవన్ కళ్యాణ్ ఏజెండా ఏంటో మరోసారి బహిర్గతం అయింది. తనకు తెలుగుదేశంతో ఎలాంటి సంబంధం లేదంటూనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని రక్షించే ప్రయత్నాలు బహిరంగంగానే చేస్తున్నారు. ప్రత్యేక హోదా విషయంలో ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి సవాల్ విసిరారు. దానికి పవన్ కళ్యాణ్ స్పందించారు. ఇందులో తప్పుపట్టాల్సింది ఏమీలేదు. జగన్ ను అవిశ్వాస తీర్మానం పెట్టాలని డిమాండ్ చేయటంలోనూ తప్పుపట్టాల్సింది ఏమీలేదు. జగన్ కు దమ్ము, ధైర్యం ఎక్కువ అని వ్యాఖ్యానించారు. ఓకే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం చేయాల్సిన ప్రధాన బాధ్యత అధికార తెలుగుదేశం పార్టీపై ఉంటుందా?.లేక ప్రతిపక్ష వైసీపీపై ఉంటుందా?. ఓ వైపు అధికార తెలుగుదేశం పార్టీ ఏపీకి విభజన సమయంలో కాంగ్రెస్, ఇప్పుడు బిజెపి అన్యాయం చేసిందని చెబుతున్న చంద్రబాబునాయుడిని మాత్రం పవన్ అలా వదిలేశారు. అవిశ్వాసం పెడితే టీడీపీ వైఖరి ఏంటో తేలుతుంది అని చెబుతున్నారు తప్ప...వైసీపీని అడిగినంత గట్టిగా టీడీపీని అవిశ్వాసం పెట్టాలని డిమాండ్ చేయకపోవటం ద్వారా పవన్ తన వైఖరి ఏంటో స్పష్టం చేశారు.

గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపునకు కాస్తో కూస్తో సహకరించింది పవన్ కళ్యాణ్. నిజంగా పవన్ కళ్యాణ్ గట్టిగా ఏదైనా అడిగే హక్కు ఉంది అంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీనే. కానీ అధికార టీడీపీని వదిలేసి..పవన్ కళ్యాణ్ జగన్ ను టార్గెట్ చేసి...చంద్రబాబును వదిలేసినట్లు స్పష్టంగా కన్పిస్తోంది. పవన్ అవిశ్వాసం డిమాండ్ పై జగన్ స్వయంగా స్పందించినందున అవిశ్వాసం పెట్టాల్సిన బాధ్యత ఆ పార్టీపై ఉంటుంది. కానీ పవన్ వైఖరి చూస్తుంటే జగన్ ను ఫిక్స్ చేసి...చంద్రబాబుకు ఊరట కల్పించే ప్రయత్నం చేస్తున్నట్లు స్పష్టంగా కనపడుతుంది. వైసీపీని అంత గట్టిగా డిమాండ్ చేసిన పవన్...అధికార టీడీపీని అదే రీతిలో అడగకపోవటంతో ఆయన వైఖరి ఏంటో తేటతెల్లం అవుతుంది.

 

Similar News