‘పరిటాల’ ఇంటికి పవన్ కళ్యాణ్

Update: 2018-01-28 05:27 GMT

పవన్ కళ్యాణ్ పొలిటికల్ ప్లాన్ ఏంటో క్లారిటీ వస్తూనే ఉంది. వచ్చే ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీతోనే కలసి ముందుకు సాగటానికి ఈ జనసేనాని రెడీ రెడీవుతున్నట్లు స్పష్టంగా కన్పిస్తోంది. ఆయన ఆ దిశగానే సంకేతాలు పంపుతున్నారు. అందులో భాగంగానా అన్నట్లు ఆదివారం ఉదయం ఆయన మంత్రి పరిటాల సునీత ఇంటికెళ్లారు. అక్కడే మంత్రితో పాటు సాగునీటి రంగ నిపుణులతో కలసి హంద్రినీవా ప్రాజెక్టుపై చర్చించారు. జిల్లాలోని సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్ళానని పవన్ తెలిపారు. హైకోర్టు రాయలసీమలో ఏర్పాటుచేయాలని పవన్ కళ్యాణ్ కోరారు. పరిటాల ఇంట్లోనే టిఫిన్ చేసి..అనంతపురం జిల్లా సమస్యలు..పరిష్కారాలకు చేపట్టాల్సిన అంశాలపై మాట్లాడారు. తమ ఇంటికి వచ్చిన పవన్ కళ్యాణ్ ను పరిటాల రవి తనయుడు శ్రీరామ్ సాదరంగా ఆహ్వానించారు. తర్వాత మీడియాతో మాట్లాడిన పవన్ దివంగత పరిటాల రవితో తనకు ఎలాంటి విబేధాలు లేవన్నారు.

‘‘ప్రజాభీష్టం మేరకు, ప్రజలు కోరితే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తుపై నిర్ణయం తీసుకుంటా. ఒకే ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం సరికాదు. ఏపీ హైకోర్టు రాయలసీమలో ఏర్పాటయ్యేలా కృషి చేస్తాను. వెనుకబాటుకు గురైన రాయలసీమను సత్వరం అభివృద్ధి చేయకుంటే ప్రాంతీయవాదం తలెత్తే ప్రమాదం ఉంది’’ అన్నారు. 2019 ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచి పోటీ చెయ్యబోయేది ఇంకా నిర్ణయించుకోలేదని, దానిపై త్వరలోనే ప్రకటన చేస్తానని తెలిపారు. గతంలో పరిటాల రవి ఓ ఘటనలో పవన్ కు గుండు కొట్టించారని జోరుగా ప్రచారం సాగిన సంగతి తెలిసిందే. అయితే ఈ మధ్యే పవన్ దీన్ని బహిరంగంగా ఖండించారు. అదే సమయంలో తెలుగుదేశం నేతలే ఈ ప్రచారాం చేశారని ప్రకటించారు.

 

 

 

Similar News