చంద్రబాబు ప్రకటనను ఖండించిన మంత్రి ‘కొల్లు’

Update: 2018-01-09 10:53 GMT

సాక్ష్యాత్తూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన ప్రకటననే మంత్రి కొల్లు రవీంద్ర ఖండించారు. గత ఏడాది సెప్టెంబర్ 12న విశాఖపట్నంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వయంగా నటి పూనమ్ కౌర్ ఏపీ హ్యాండ్లూమ్ బ్రాండ్ అంబాసిడర్ గా నియమిస్తున్నట్లు ప్రకటించారు. ఆ ఫోటోను కూడా ఈ వార్తలో చూడొచ్చు. అయితే దీనికి సంబంధించిన జీవో రాలేదు కానీ..ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపై ప్రకటన చేసింది మాత్రం ముమ్మాటికి వాస్తవం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిఫారసుతోనే చంద్రబాబు ఆమెను చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారని కత్తి మహేష్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది ఇప్పుడు వివాదంగా మారింది. ఈ సమయంలో నటి పూనమ్‌కౌర్‌పై ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర సంచలన ప్రకటన చేశారు.

తాను చేనేత శాఖకు మంత్రిగా ఉన్న సమయంలో చేనేత వస్త్రాలకు సంబంధించి ఎవరినీ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించలేదని స్పష్టం చేశారు. అసలు ప్రభుత్వ పరంగా అలాంటి నియామకమే జరగలేదని ఆయన తెలిపారు. ప్రభుత్వ పరంగా అంబాసిడర్‌ను నియమించాలనే చర్చ జరగలేదని, కొంతమంది చేనేత సంఘ సభ్యులు పవన్‌ కల్యాణ్‌ను అంబాసిడర్‌గా ఉండాలని చెప్పి ఆయనను కలిసి కోరారని తెలిపారు. అంతే తప్ప.. చేనేత వస్త్రాలకు సంబంధించి ఎవరినీ బ్రాండ్ అంబాసిడార్‌గా నియమించలేదని కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. మరి మంత్రి మాటలు చూస్తుంటే చంద్రబాబు మాటలను ఖండిస్తున్నట్లు లేదూ. పూనమ్ కౌర్ ను చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా నియమిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించటం…అందుకు ఆమె వేదిక నుంచి అభివాదం చేయటం కూడా చిత్రంలో చూడొచ్చు.

Similar News