వారసులను భవిష్యత్ నిర్ణయిస్తుంది

Update: 2018-01-30 15:53 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కెసీఆర్ రాజకీయ వారసులు ఎవరు అన్నది భవిష్యత్..కాలమే నిర్ణయిస్తుందని వ్యాఖ్యానించారు. ఈ విషయం చెప్పటానికి తనకు జ్యోతిష్యం తెలియదన్నారు. కవిత మంగళవారం నాడు సచివాలయంలో మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై స్పందించారు. వచ్చే ఎన్నికల్లో హరీష్ రావు ఎంపీగా పోటీచేయనున్నారనే అంశంపై తాను మాట్లాడనని అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీఆర్‌ఎస్‌కు 100 సీట్లు ఖాయమని కవిత ధీమా వ్యక్తం చేశారు. పార్టీలు అన్నీ ఏకమైనా 2019లో వార్‌ వన్‌ సైడేనని, కేసీఆర్‌దే విజయమని ఆమె వ్యాఖ్యానించారు. అన్నీ పార్టీలు ఏకమై పోటీ చేసినా టీఆర్ఎస్‌కు వంద సీట్లు రావడం గ్యారెంటీ అని అన్నారు.

వచ్చే ఎన్నికల్లో తాను ఎంపీ లేదా ఎమ్మెల్యేగా పోటీ చేయాలా అన్నదానిపై పార్టీదే తుది నిర్ణయమన్నారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి చాలామంది టీఆర్‌ఎస్‌లోకి రావడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. విభజన హామీలపై కేంద్రం త్వరగా తేల్చాలని కవిత అన్నారు. తమకు సీట్ల పెంపు ప్రాధాన్యతా అంశం కాదన్నారు. జమిలీ ఎన్నికల ప్రస్తావన రాలేదని, వస్తే పార్టీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. తెలంగాణ టీడీపీని టీఆర్‌ఎస్‌తో విలీనం చేయాలన్న మోత్కుపల్లి నర్సింహులు ప్రతిపాదనను తాము స్వాగతిస్తున్నామన్నారు. ఐపీసీలోని సెక్షన్‌ 506,507 సవరణ సోషల్‌ మీడియాను అదుపు చేసేందుకు కాదని అన్నారు. కోదండరామ్‌ రాజకీయ పార్టీ పెడితే తాము స్వాగతిస్తామని ఎంపీ కవిత పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ కు కూడా పోటీచేసే హక్కు ఉందని..ఓట్లు వేయాలా లేదా అన్నది ప్రజలు నిర్ణయించుకుంటారన్నారు.

 

 

Similar News