మీ గొంతు కూడా ఇక మీది కాదు !

Update: 2023-04-11 16:21 GMT

Full ViewFull Viewవినటానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది వాస్తవం. ఎందుకంటే సాంకేతికత పెరిగే కొద్దీ నేరాలు చేసేవాళ్ళు కూడా కొత్త కొత్త టెక్నాలజీలను వాడుతున్నారు. ఇప్పుడు అందరిలో ఆందోళన రేపుతున్న అంశం కృత్రిమ మేధ (ఏఐ). సైబర్ నేరగాళ్లు ఇప్పుడు దీన్ని ఆసరాగా చేసుకుని వాయిస్ క్లోనింగ్ కు పాల్పడుతున్నారు. ఎలాగంటే ఉదాహరణకు కాలేజీ కి వెళ్లిన మీ అమ్మాయి...అబ్బాయో ఫోన్ చేసినట్లు చేసి మాట్లాడతారు. ఆ వాయిస్ విన్న పేరెంట్స్ కు కూడా ఎలాంటి అనుమానం కూడా రాదు. ఎందుకు అంటే అది అచ్చం వారి పిల్లల వాయిస్ లాగానే ఉంటుంది కాబట్టి. ఇప్పటికే అగ్ర రాజ్యం అమెరికా తో పాటు పలు ప్రాంతాల్లో ఈ తరహా ఘటనలు నమోదు అవుతూనే ఉన్నాయి. కిడ్నాప్ చేసినట్లు పిల్లల వాయిస్ తో పేరెంట్స్ కు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేయటం...సైబర్ నేరగాళ్లు ఫోన్ లో మాట్లాడే సమయంలో ఏ మాత్రం అనుమానం రాకుండా అచ్చం వాళ్ళ పిల్లల వాయిస్ తో భయపడుతున్నట్లు...వాళ్ళు అడిగిన డబ్బు ఇవ్వాలన్నట్లు కోరటం వంటి టెక్నీక్ లు వాడుతున్నారు. ఇది అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారానే వాయిస్ క్లోనింగ్ ద్వారా చేస్తున్నారు.

                                              సైబర్ నేరగాళ్లకు ఇప్పుడు ఇది ఒక పెద్ద అస్త్రంగా మారినట్లు ఈ రంగంలోని నిపుణులు చెపుతున్నారు. గత ఏడాది కాలంలో ఇలాంటి మోసాల ద్వారా ఏకంగా దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయల మేర స్కాం లు చేసారంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. ఏఐ తో చోటు చేసుకుంటున్న ఈ వాయిస్ స్కాం లు ఇప్పుడు పెద్ద సవాలుగా మారబోతున్నాయి. ఎందుకంటే ఫోన్ లో అవతల వ్యక్తి మాట్లాడే మాటలు ఏ మాత్రం కూడా అనుమానం రాకుండా ఉండేలా వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ప్రమాదాలు జరిగినట్లు...లేదంటే ఇతర పనుల కోసం మాట్లాడుతున్నట్లు చెపుతూ వాయిస్ క్లోనింగ్ తో డబ్బులు అడుగుతూ మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వాటి విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది అని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఈ వాయిస్ క్లోనింగ్ అంశం రాజకీయ నాయకులకు ఒక అస్త్రంగా...అదే సమయంలో ఒక ప్రమాదంగా కూడా మారే అవకాశం లేక పోలేదు అని చెపుతున్నారు.

Tags:    

Similar News