కేంద్ర వ్యాక్సినేషన్ విధానంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో మోడీ సర్కారు మాత్రం తన విధానానికే కట్టుబడి ఉన్నట్లు ప్రకటించింది. అంతే కాదు ధరల విషయంలో కూడా తన విధానాన్ని సమర్ధించుకుంటూ సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించటం ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. వ్యాక్సినేషన్ విధానంలో కోర్టులు జోక్యం చేసుకోవటం సరికాదని..దీని వల్ల సమస్యలు వస్తాయని పేర్కొంది. నిపుణులు, శాస్త్రీయ సలహాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో ఈ అంశాలను ప్రస్తావించారు. దేశంలో వ్యాక్సిన్ ధరలు సహేతుకంగానే ఉన్నాయని, దేశమంతటా కూడా ఒకే ధరలు ఉన్నాయని పేర్కొంది.
పోటీతత్వ మార్కెట్ ఏర్పాటు , ప్రైవేట్ వ్యాక్సిన్ తయారీదారులను డిమాండ్ ను సృష్టించే పద్దతిలో భాగంగానే ధరలో వ్యత్యాసాలు ఉన్నట్లు తెలిపింది. ధరలు ఎలా ఉన్నా దేశ వ్యాప్తంగా ప్రజలందరికీ ఉచిత వ్యాక్సిన్ అందుతుందని..పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ఈ మేరకు తమ నిర్ణయాలు ప్రకటించాయని కేంద్రం తన అఫిడవిట్ లో ప్రస్తావించటం విశేషం. సుప్రీంకోర్టు సుమోటోగా కరోనా అంశంపై విచారణ చేస్తూ గతంలో కీలక వ్యాఖ్యలు చేసింది. ధరల వ్యత్యాసాన్ని ప్రశ్నించింది. ఈ తరుణంలో కేంద్రం పలు అంశాలపై తన వాదననను అఫిడఫిట్ రూపంలో సమర్పించింది.