ప్రపంచం అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు ఎలాంటి ఫలితం లేకుండానే ముగిశాయి. ఇస్లామాబాద్ వేదికగా జరిగిన ఈ చర్చల్లో ఎలాంటి ఒప్పందం జరగలేదు. అయినా సరే అమెరికా మాత్రం వేచిచూసే ధరణిలోనే ఉన్నట్లు స్పష్టమైన సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ చర్చల్లో అమెరికా తరపున పాల్గొన్న ఆ దేశ వైస్ ప్రెసిడెంట్ జె డీ వాన్స్ మాత్రం ఇప్పటికైతే ఎలాంటి ఒప్పందం జరగలేదు అని...తమ డిమాండ్స్ కు ఇరాన్ అంగీకరించటం లేదు అని వెల్లడించారు. చర్చలు మరో రోజు పొడిగించాలని పాకిస్థాన్ కోరినా కూడా అదేమీ జరగలేదు. అమెరికా బృందం తమ దేశానికీ బయలుదేరి వెళ్ళింది. ఇరాన్ ప్రతినిధులతో అనేక ముఖ్య విషయాలపై చర్చలు జరిపామని అని.. అయితే గల్ఫ్‌లో దీర్ఘకాలిక ప్రాతిపదికన శాంతిని నెలకొల్పేలా వారు ఒప్పందాన్ని కుదుర్చుకోలేకపోయారు అని వాన్స్ ఇస్లామాబాద్‌లో జరిగిన పత్రికా సమావేశంలో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు.
అణ్వాయుధాల అభివృద్ధికి ప్రయత్నాలు ఉండబోవన్న హామీ కావాలి అని అమెరికా కోరగా..ఇందుకు ఇరాన్ నో చెప్పింది. తాము ఆశిస్తున్న విషయం ఇదే అని... త్వరిత గతిన ఈ ఆయుధాన్ని సాధించే ప్రయత్నాలు ఏవీ జరగవన్న హామీ కావాలి.. అధ్యక్షుడు ట్రంప్ లక్ష్యం ఇదే అని వాన్స్ చెప్పుకొచ్చారు. చర్చల్లో ఇలాంటి హామీల కోసమే ప్రయత్నించాము అని తెలిపారు. ముఖ్యంగా అణ్వాయుధాల తయారీ, హర్ముజ్ జలసంధి విషయంలోనే పీటముడి పడినట్లు ఇరాన్ మీడియా కూడా స్పష్టం చేసింది. చర్చలు విఫలం అయినందున అమెరికా ఇప్పటికిప్పుడు దూకుడుగా వెళ్లే అవకాశాలు లేవు అని నిపుణులు చెపుతున్నారు.
ఎందుకంటే మళ్ళీ తీవ్ర స్థాయిలో యుద్ధం మొదలుపెడితే దీని పరిణామాలు ప్రపంచం ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా ఉండే అవకాశం ఉంది...అదే సమయంలో ఆ ప్రభావం అమెరికా పై కూడా తీవ్రంగానే ఉంటుంది. ఈ యుద్ధం కారణంగా ఇప్పటికే అమెరికా భారీగా నష్టపోయింది. అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా సొంత దేశంలో తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. చర్చలు విఫలం అయిన తర్వాత డోనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఇరాన్‌పై ఇప్పటికే సైనిక విజయం సాధించాం..చర్చల్లో ఏం జరుగుతుందనేది తనకు అనవసరం..హర్ముజ్ జలసంధి విషయంలో మాత్రం వెనక్కి తగ్గేది లేదు అన్నారు. ఒప్పందం ఏదైనా జలసంధిలోని మైన్లను తొలగిస్తాం అని ప్రకటించారు.
డోనాల్డ్ ట్రంప్ తాజా ప్రకటన చూస్తే ఆయన గతంలో చూపించిన దూకుడును తగ్గించినట్లు ఉంది అనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది. యుద్ధంతో సాధించలేనివి చర్చల్లో అమెరికా అడిగింది అని ఇరాన్ ఎద్దేవా చేసింది. తాము వీటిని నో చెప్పినట్లు స్పష్టం చేసింది. చర్చలు ముగిశాయి, హార్ముజ్ జలసంధి ఇంకా మూసే ఉంది..ఖాళీ చేతులతో అమెరికా ఉపాధ్యక్షుడు వెనుతిరిగారు. అమెరికా పరువు నిలుపుకోడానికి..వారి దగ్గర ఇక వేరే ఏ మార్గం లేదు అని ఇరాన్ వ్యాఖ్యానించటం విశేషం. చర్చలు విఫలం అయ్యాయని అధికారికంగా ప్రకటించిన తర్వాత అమెరికా తదుపరి మూవ్ ఎలా ఉంటుంది అన్నదే ఇప్పుడు కీలకంగా మారబోతుంది. సేఫ్ ఎగ్జిట్ కోసం ఎదురుచూస్తున్న డోనాల్డ్ ట్రంప్ తన పరువు నిలబెట్టుకోవడానికి తదుపరి ఏమి చేస్తారు అన్నదే అందరిలో ఉత్కంఠ రేపుతున్న విషయం.