ఫైజర్ వ్యాక్సిన్ ఓకే..అమెరికా నిపుణుల కమిటీ

Update: 2020-12-11 06:16 GMT

కరోనాతో అల్లకల్లోలం అవుతున్న అగ్రరాజ్యం అమెరికాకు ఊరట. అమెరికాకు చెందిన నిపుణుల కమిటీ దిగ్గజ ఫార్మా సంస్థ ఫైజర్, బయోఎన్ టెక్ తో కలసి సంయుక్తంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక ఎఫ్ డీఏ ఆమోదం తెలపటమే ఆలశ్యం. అమెరికాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఫైజర్ వ్యాక్సిన్‌ వినియోగంలో రిస్కులతో పోలిస్తే రోగులకు ఉపశమన అవకాశాలే అధికంగా ఉన్నట్లు అభిప్రాయపడింది. బ్రిటన్ లో అలెర్జీలున్న వ్యక్తులకు వ్యాక్సిన్‌ను ఇవ్వవద్దంటూ ఆదేశాలు జారీ అయిన నేపథ్యంలో ప్రభుత్వ ప్యానల్‌ సిఫారసుకు ప్రాధాన్యత ఏర్పడింది. 20 మందితో ఏర్పాటైన వ్యాక్సిన్లు, సంబంధిత బయోలాజికల్‌ ప్రొడక్టుల సలహా కమిటీ(వీఆర్‌బీపీఏసీ) ఫైజర్‌ వ్యాక్సిన్‌కు 17-4 ఓట్లతో ఆమోదముద్ర వేసింది. దీంతో యూఎస్‌ ఔషధ నియంత్రణ సంస్థ(ఎఫ్‌డీఏ) ఫైజర్‌ వ్యాక్సిన్‌కు డిసెంబర్ 11 నుంచి అనుమతి మంజూరు చేసే అవకాశమున్నట్లు ఫార్మా వర్గాలు అంచనా వేస్తున్నాయి.

సెకండ్‌వేవ్‌లో భాగంగా అమెరికాలో కేసులు, మరణాల సంఖ్య పెరగుతున్న కారణంగా యూఎస్‌ఎఫ్‌డీఏ త్వరితగతిన అత్యవసర వినియోగానికి అనుమతించవచ్చని అభిప్రాయడ్డారు. యూఎస్‌లో కరోనా వైరస్‌ బారినపడినవారి సంఖ్య 1.5 కోట్లకు చేరగా.. మరణాల సంఖ్య 2.8 లక్షలకు చేరినట్లు తెలియజేశారు.నిపుణులు కమిటీ సూచనలను యూఎస్‌ఎఫ్‌డీఏ తప్పనిసరిగా పాటించవలసిన అవసరంలేదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. జర్మన్‌ కంపెనీ బయోఎన్‌టెక్‌తో భాగస్వామ్యంలో ఫైజర్‌ రూపొందించిన వ్యాక్సిన్‌ వినియోగానికి ఇటీవల యూకే, కెనడా, బెహ్రయిన్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వ సలహా మండలి ఇచ్చిన నివేదిక సూచనలు మాత్రమేనని.. యూఎస్‌ఎఫ్‌డీఏ వీటికి కట్టుబడవలసిన అవసరంలేదని నిపుణులు తెలియజేశారు.

Tags:    

Similar News