ప్రపంచంలో ఎవరైనా సరే తన మాట వినాల్సిందే అన్నట్లు వ్యవహరిస్తూ వస్తున్నాడు అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్. గత కొంత కాలంగా ఆయన తీరు ఇలాగే ఉన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. తన మాట వినటం లేదు అని..తాను చెప్పినట్లు అంగీకరించటం లేదు అని ఇండియా పై తొలుత 25 శాతం సుంకాలు విధించిన డోనాల్డ్ ట్రంప్...ఆ తర్వాత రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నారు అని చెప్పి మరో 25 శాతం సుంకాలు విధించారు. దీంతో ఇండియా పై అమెరికా విధించిన సుంకాలు మొత్తం 50 శాతానికి చేరాయి. కొద్ది రోజుల క్రితం వైట్ హౌస్ కు వెళ్లిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ని కూడా అవమానకరంగా బయటకు పంపారు. అయితే ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగిన సమయంలో జెలెన్‌స్కీ కూడా ఏ మాత్రం వెనక్కితగ్గకుండా అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ కు గట్టి ఝలక్ ఇచ్చారు. అప్పటిలో ఆ వీడియో సోషల్ మీడియా లో పెద్ద వైరల్ గా మారింది. అయితే తాజాగా అమెరికాలోని అలస్కా లో అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్, రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ల మధ్య జరిగిన భేటీ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు చూస్తుంటే పుతిన్ ముందు డోనాల్డ్ ట్రంప్ ఆటలు పెద్దగా సాగలేదు అనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
కొద్ది రోజుల క్రితం తాను చెప్పినట్లు విని ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ఆపేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి అని ...రష్యా పై మరిన్ని ఆంక్షలు విధిస్తాం అని హెచ్చరించిన ట్రంప్ ఇప్పుడు అందుకు బిన్నంగా స్పందిస్తున్నారు. తమ ఇద్దరి మధ్య భేటీ లో ఒక అంగీకారానికి రాలేకపోయినట్లు చెపుతూనే చర్చలు మాత్రం బాగా సాగినట్లు చెప్పుకొస్తున్నారు. ఇదే నిజం అయితే ఒప్పందం ఎందుకు చేసుకోలేకపోయినట్లు అనే ప్రశ్న ఉదయించకమానదు. మరో వైపు కొద్ది రోజుల క్రితమే ఇండియా, రష్యాలవి మృత ఆర్థిక వ్యవస్థలు అని నోరు పారేసుకున్న ట్రంప్ ఇప్పుడు సడన్ గా రష్యా బలమైన దేశం..ప్రపంచంలోనే రెండవ స్థానంలో ఉంది అని మాట్లాడటంతోనే పుతిన్ ముందు ట్రంప్ ఒత్తిళ్లు ఏ మాత్రం పని చేయలేదు అన్న విషయం స్పష్టంగా కనిపిస్తోంది అనే చర్చ సాగుతోంది.
మరో వైపు తాను చెపితే చాలు..ఏ దేశం అయినా సరే వెంటనే కాల్పుల విరమణ చేయాలి అనే ధోరణితో ఉండే డోనాల్డ్ ట్రంప్ రష్యా..ఉక్రెయిన్ ల మధ్య కాల్పుల విరమణ కంటే పూర్తి స్థాయి శాంతి ఒప్పందం మాత్రమే మేలు అని చెప్పటం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. అదే సమయంలో ఇండియా పై మరిన్ని అదనపు సుంకాలు ఉండవు అని కూడా డోనాల్డ్ ట్రంప్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. అయితే రష్యా పేరు చెప్పి వేసిన 25 శాతాన్ని కూడా ఉపసంహరించుకుంటారా లేదా అన్నది కొద్ది రోజుల్లోనే తేలనుంది. డోనాల్డ్ ట్రంప్ విషయంలో ఢీ అంటే ఢీ అన్నట్లు వ్యవహరించిన చైనా, రష్యాల విషయంలోనే ఆయన వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది అనే చర్చ కూడా సాగుతోంది. అయితే ఇండియా మాత్రం ఇందుకు భిన్నమైన వైఖరి అనుసరిస్తోంది. మరో వైపు కారణాలు ఏమైనా కూడా డోనాల్డ్ ట్రంప్ దూకుడు తగ్గించి మారుతున్నారు అనటానికి అలస్కా మీటింగ్ ఒక ఉదాహరణగా చెపుతున్నారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో డోనాల్డ్ ట్రంప్ ఇంకెన్ని విచిత్ర ప్రకటనలు చేస్తారో.