అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పరిస్థితి ఇప్పుడు దారుణంగా మారినట్లు కనిపిస్తోంది. ఇరాన్ ను తాము అన్ని రకాలుగా దెబ్బకొట్టామని ఆయన పదే పదే గొప్పలు చెప్పుకుంటున్నా కూడా క్షేత్ర స్థాయిలో పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. ఇరాన్ వరసపెట్టి అమెరికాకు చెందిన అత్యాధునిక విమానాలను కూల్చివేస్తున్న తీరు చూసి ప్రపంచం అవాక్కు అవుతోంది. ఈ పరిణామాలు అన్నీ అమెరికాకు వరస షాక్ లు గా మారాయి. ఒకే రోజు అమెరికాకు చెందిన రెండు యుద్ధ విమానాలను ఇరాన్ కూల్చేసింది. అక్కడితో ఆగలేదు..రెండు హెలీకాఫ్టర్లపైనా దాడులు చేసింది. ఈ దాడుల్లో ఇద్దరు పైలట్స్ సురక్షితంగా బయటపడగా...ఒకరు మాత్రం మిస్ అయ్యారు. అమెరికా కు చెందిన ఎఫ్ 15 ఈ స్ట్రైక్ ఈగల్ విమానాన్ని కూల్చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. దీంతో పాటు హర్ముజ్ జలసంధి దగ్గర మరో ఏ 10 వార్ ఫైటర్ జెట్ ను కూడా కూల్చేశారు.
ఒక వైపు ఇరాన్ గగనతల సామర్ధ్యాన్ని పూర్తిగా దెబ్బతీశామని అమెరికా చెప్పుకుంటున్న వేళ ఒకే రోజు రెండు అమెరికా విమానాలను ఇరాన్ కూల్చివేయటం ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది. ఇరాన్ తమ విమానాలను కూల్చినా కూడా చర్చలకు ఇవి ఏ మాత్రం అడ్డంకి కాబోవు అని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చెప్పటంతో ఆయన ఎంత ఒత్తిడిలో ఉన్నారో అర్ధం అవుతోంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. తాము యుద్ధంలో ఉన్నామని..ఇలాంటి దౌత్య చర్చలపై ప్రభావం చూపించబోవు ట్రంప్ చెప్పుకొచ్చారు. అమెరికాకు చెందిన ఏ- 10 యుద్ధ విమానం ఇరాన్ దాడుల్లో కూలిపోయిన వీడియో ను ముంబై లోని ఇరాన్ కాన్సులేట్ కార్యాలయం ఎక్స్ లో పోస్ట్ చేసింది. తాజాగా అమెరికా 48 గంటల కాల్పుల విరమణ ప్రతిపాదన చేయగా ..దీన్ని ఇరాన్ తోసిపుచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. మరో వైపు ఇరాన్ గల్ఫ్ లోని అమెరికా బేస్ లపై తన దాడులను కొనసాగిస్తోంది. తమతో ఒప్పందానికి రాకపోతే మాత్రం ఇరాన్ రాబోయే రోజుల్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అని డోనాల్డ్ ట్రంప్ హెచ్చరిస్తున్నారు. అయినా సరే ఇరాన్ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా తన పోరాటాన్ని కొనసాగిస్తోంది.